మహాసేన పేరుతో మీడియా సంస్థను నెలకొల్పి దళితుల కోసం బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి పేరు సంపాదించిన వ్యక్తి రాజేష్. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అతను వీడియోలు చేసిన సంగతి తెలిసిందే.
కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే రాజేష్ ఆ పార్టీకి పూర్తి వ్యతిరేకిగా మారిపోయారు. వైసీపీకి వ్యతిరేకంగా బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలుస్తూ జనసేనలోకి చేరబోతున్న సంకేతాలు కూడా ఇచ్చాడు ఒక టైంలో.
కానీ తర్వాత అంచనాలకు భిన్నంగా గత ఏడాది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఆ పార్టీ తరఫున పి.గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కూడా సంపాదించాడు. కానీ వైసీపీ వాళ్లు అతడి పాత వీడియోలేవో తిప్పి నెగెటివ్ ప్రచారం చేయడంతో కొన్ని రోజులకే టికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఆ నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లింది.
ఆ తర్వాత కొన్ని రోజులకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సొంతంగా అభ్యర్థులను నిలబెడుతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు రాజేష్. కానీ మళ్లీ కొన్ని రోజులకు యుటర్న్ తీసుకుని తెలుగుదేశం పార్టీకే మద్దతు, కూటమి కోసం నిలబడతానని ప్రకటించాడు. ఐతే ఇప్పుడు ఆ స్టాండ్ మీద కూడా నిలబడుతున్నట్లు కనిపించడం లేదు.
అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద యుద్ధం ప్రకటించాడు రాజేష్. పవన్ కళ్యాణ్ తనను నమ్ముకున్న జనం కోసం నిలబడడని.. ఈ విషయంలో జగన్ ఎన్నో రెట్లు బెటర్ అని.. పవన్ కళ్యాణ్ వల్ల సమాజానికి నష్టమని.. ఈ విషయాన్నే వివరిస్తూ జనాల్లోకి వెళ్లబోతున్నానని మహాసేన రాజేష్ స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం.
అంతేకాక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 200 శాతం ఓడిపోతాడని కూడా రాజేష్ జోస్యం చెప్పాడు. ఇలా రోజుకో మాట మాట్లాడుతూ, స్టాండ్ తీసుకుంటూ మహాసేన రాజేష్ క్రెడిబిలిటీ కోల్పోతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.