భారత సైనికులంటే చైనీయులు వణికిపోతున్నారా?

దాయాది పాకిస్థాన్ తో యుద్ధమంటే ఒక్కసారిగా ముందుకు ఉరికే చాలామంది భారతీయులు.. చైనీయులతో అనేసరికి మాత్రం కాస్త ఆలోచనలో పడతారు. దానికి కారణం అందరికి తెలిసిందే. భారత్ కంటే చైనా ఎంతో శక్తివంతమైనదన్న గణాంకాల లెక్కలతో పాటు.. పాత గురుతులు వెంటాడుతుంటాయి.

అయితే.. అన్ని రోజులు ఒకేలా ఉండవన్న విషయాన్ని భారతీయులు మరిచిపోయారు. తాజాగా గల్వాన్ లో డ్రాగన్ సైనికుల దురాగతానికి మనోళ్లు ఇరవై మంది మరణించారు. ఇంతవరకూ ఓకే. కానీ.. చైనా సైనికులు నలభైకి పైగా చనిపోయినట్లుగా అంతర్జాతీయ మీడియాలో వచ్చింది.

చైనా కన్ఫర్మ్ చేయని సంగతి తెలిసిందే. ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తటం మొదలయ్యాక.. ఇక తప్పదన్నట్లుగా ఒక ముక్తసరి ప్రకటన చేసింది. దాని సారాంశం.. భారత సైనికులు చనిపోయిన దాని కంటే తక్కువగానే చనిపోయినట్లుగా పేర్కొంది.

ఈ ఎపిసోడ్ ను ఇక్కడ ఆపితే.. కొన్ని సందేహాలు చాలామందికి వచ్చాయి. అవేమంటే.. మన కంటే ఎక్కువ మంది ఉన్న చైనా వారిని తక్కువమంది ఉన్న మనోళ్లు ఎలా చంపారు? వారి దగ్గర ఇనుపముళ్లు ఉన్న కర్రలు ఉన్నాయి. మనోళ్ల దగ్గర ఏమీ లేదు. అనూహ్యంగా రాళ్లతో దాడి చేశారు. మనోళ్లు అంత సిద్ధంగా లేరు. అలాంటప్పుడు మనోళ్లు వారిని ఎలా చంపగలిగారు? చైనీయుల కంటే ఎక్కువ మందిని చంపిన భారత సైనికులు.. చైనీయులకు ఎలా చిక్కారు? లాంటి ప్రశ్నలెన్నో.

తాజాగా చైనా విడుదల చేసిన భారత సైనికుల్ని పలు పరీక్షలు నిర్వహించిన తర్వాత.. వారి నుంచి జరిగిన విషయాల గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే.. వారు చెప్పిన విశేషాలతో అప్పటివరకూ ఉన్న సందేహాలన్ని మాయమయ్యాయి.

ఆయుధాలు లేని భారత సైనికుల్లో.. తమ పై అధికారి సంతోష్ బాబును హతమార్చిన వైనం వారిలో ఆవేశాన్నివిపరీతంగా పెంచేసింది. తమ అధికారిని చంపుతారా అన్న వీరావేశంతో ఒక్కొక్కరు ఒక్కో వీరభద్రుడే అయ్యారు.అదెంతలా అంటే.. చైనీయుల చేతుల్లోని ఆయుధాలన లాక్కొని మరీ.. కుళ్ల బొడిచారు. అక్కడితో ఆగని మన సైనికులు.. వారిని వెంబడించి మరీ తరిమారు.

ఉగ్రరూపంలో ఉన్న భారత సైనికుల దెబ్బకు చైనీయులు పరారీ. అదే ఊపులో భారత సైనికులు వారిని వెంటాడి.. వారికి కొందరు చిక్కారు. ఇలా భారత సైనికుల శక్తి సామర్థ్యాలు చైనీయులు కళ్లారా చూసిన తర్వాత.. మనోళ్లు అంటేనే హడలిపోతున్నారట. చైనీయుల అధిపత్యంలో ఉన్న ప్రాంతాల్లోకి బెరుకు లేకుండా వచ్చిన వారిని బంధించినా.. భారత సైనికుల పేరు చెప్పినంతనే గతంలో మాదిరి తీసి పారేయటం లేదని చెబుతున్నారు.

నిజానికి మన సైనికులు పట్టుబడిన రోజున.. చైనీయుల పోస్టుల మీద భారత సైనికులు పడి.. వారి సంగతి చూస్తారన్న సందేహంతో బెరుకు.. బెరుకుగా ఉన్నారట. అయితే.. అలాంటిదేమీ చోటు చేసుకోలేదని చెబుతున్నారు.

భారత సైనికులు ప్రదర్శించిన సాహసం చైనీయులకు చుక్కలు చూపిస్తోంది. ఎందుకిలా అంటే? గడిచిన కొన్ని దశాబ్దాలుగా కశ్మీర్ లో తీవ్రవాదులతో నిత్యం పోరాడటం వల్ల శక్తిసామర్థ్యాలు మరింత పెరిగితే.. చైనీయులది అందుకు భిన్నమైన పరిస్థితి. ఇటీవల కాలంలో వారికి ఎవరితోనూ తలబడాల్సిన అవసరం లేకపోవటంతో.. చాలామంది సైనికుల్లో అనూహ్య పరిణామాలకు స్పందించే గుణం మిస్ అయ్యిందంటున్నారు.

ఈ విషయంలో భారతీయ సైనికులు చైనీయుల కంటే మెరుగ్గా ఉన్న విషయం స్పష్టమైంది. మొత్తంగా చూస్తే.. ఈ ఎపిసోడ్ తో చైనీయులకు భారత సైనికుల శక్తి సామర్థ్యాలు తెలీటమే కాదు.. వారికి బెరుకు పెరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఉదంతం భారత సైనికుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా చేస్తుందనటంలో సందేహం లేదు. వారిలోనే కాదు.. భారతీయుల్లోనూ కొత్త ఉత్సాహం తొణికిసలాడేలా చేయటం ఖాయం.