కరోనా మరణాలపై నెలకొన్న వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలిన దేశాన్ని పక్కన పెడితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కరోనా కారణంగా చనిపోయిన వారికి.. ప్రభుత్వం చెప్పే దానికి ఏ మాత్రం పొంతన లేదన్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. ఎవరేం చెప్పినా.. ప్రభుత్వాలు మాత్రం కరోనాతో చోటు చేసుకున్న మరణాల్ని చాలా తక్కువ చేసి చూపించినట్లుగా చెప్పే సందేహాలకు సమాధానాలు చెప్పింది లేదు. ఇదిలా ఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తాజాగా ఒక షాకింగ్ రిపోర్టును వెల్లడించింది.
2020 జనవరి నుంచి 2021 డిసెంబరు మధ్య కాలంలో భారతదేశంలో మొత్తంగా 47 లక్షల మంది కరోనా కారణంగా మరణించినట్లుగా చెబుతున్నారు. ఇది భారత దేశ ప్రభుత్వం ప్రకటించిన అధికారిక లెక్కలకు పది రెట్లు ఎక్కువగా చెబుతున్నారు. ప్రపంచం మొత్తంలో నమోదైన కరోనా మరణాల్లో మూడో వంతు భారత్ లోనే నమోదైనట్లు పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన రిపోర్టును భారత ప్రభుత్వం తీవ్రంగా తప్పు పడుతోంది. మీడియా రిపోర్టులు.. ఏవో వెబ్ సైట్లు ఇచ్చిన డేటాను తీసుకొని ఇలాంటివి చెప్పటం సరికాదని స్పష్టం చేసింది. కోవిడ్ మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చూపిస్తున్న లెక్కలు సత్యదూరమని చెబుతోంది. జనన.. మరణాల రిజిస్ట్రేషన్ కు భారత్ లో పటిష్టమైన విధానాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా 1.5 కోట్ల మంది మరణించినట్లుగా డబ్ల్యూహెచ్ వో రిపోర్టు వెల్లడించింది.