తొమ్మిదేళ్ల తర్వాత ధోనీసేన విజయంపై ఇదేం రగడ?

Dhoni

2011 ఏప్రిల్ 2.. భారత క్రికెట్ ప్రియులు తమ జీవితంలో అత్యంత ఆనందకర క్షణాల్ని అనుభవించిన రోజు. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ జట్టు మళ్లీ వన్డే ప్రపంచకప్‌ను సాధించిన రోజది. కపిల్ డెవిల్స్ తొలి ప్రపంచకప్‌ గెలిచే సమయానికి దేశంలోని క్రికెట్ అభిమానుల సంఖ్యతో పోలిస్తే.. 2011 నాటికి ఎన్నో రెట్లు అభిమానుల సంఖ్య పెరిగిపోయింది.

క్రికెట్ దేశ యువతను ఒక మైకంలో కమ్మేసిన సమయంలో, సచిన్ టెండుల్కర్ రికార్డు స్థాయిలో తన ఆరో ప్రపంచకప్ (చివరిది కూడా) ఆడుతుండగా.. దేశమంతా ట్రోఫీ కోసం ప్రార్థనలు చేస్తుండగా.. ధోనీసేన ఫైనల్లో అద్భుత విజయంతో ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. తుది పోరులో 275 పరుగుల భారీ లక్ష్యం ముందుండగా.. సెహ్వాన్, సచిన్, కోహ్లి వంద పరుగులకే పెవిలియన్ చేరిపోయి ఉత్కంఠ నెలకొన్న తరుణంలో గంభీర్ (97), ధోని (91 నాటౌట్) అద్భుతంగా ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు.

ఐతే ఎంతో కష్టపడి సాధించుకున్న ఈ విజయంపై లంకేయులు అప్పుడప్పుడూ సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆ దేశ రాజకీయ నాయకులు ఈ విజయాన్ని శంకిస్తుండటం గమనార్హం. తాజాగా శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహీదానంద.. ఆ మ్యాచ్ గురించి సంచలన ఆరోపణలు చేశాడు. ఆ ఫైనల్లో తమ జట్టు.. భారత్‌కు అమ్ముడుపోయిందని, ఆ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించాడు.

అది చాలదన్నట్లు.. భారత్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఆ మ్యాచ్‌పై విచారణ జరపాలంటూ 2011 ప్రపంచకప్ సమయంలో లంక జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న మాజీ ఆటగాడు అరవింద డిసిల్వా సూచన చేస్తున్నాడు. ఐతే ప్రపంచకప్ జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత ఈ ఆరోపణలేంటన్నది అర్థం కాని విషయం.

దీనిపై అప్పటి జట్టులో కీలక ఆటగాళ్లయిన సంగక్కర, జయవర్దనే తీవ్ర స్థాయిలో స్పందించారు. దేశంలో ఎన్నికలు వచ్చినపుడల్లా ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి రాజకీయ నాయకులు ఈ డ్రామాను నడిపిస్తున్నారంటూ మండిపడ్డారు.