హీరో లేకుండానే ప్రీ రిలీజ్ ఈవెంట్

చిన్నదో పెద్దదో సినిమా ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజుల్లో సర్వసాధారణం. ప్రమోషన్లలో కీలకంగా భావించే ఈ ఘట్టంలో దానికి పని చేసిన వాళ్లందరూ వచ్చేలా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటారు. అలాంటిది ఏకంగా హీరో లేకుండా వేడుక నిర్వహించడం ఊహించగలమా. కానీ రాజ్ తరుణ్ కు ఈ సంకట పరిస్థితి వచ్చింది. ఈ నెల 26న విడుదల కాబోతున్న పురుషోత్తముడు ఈవెంట్ ని అతను లేకుండా నిర్వహించేశారు. హీరోయిన్ హాసినితో పాటు బ్రహ్మానందం తదితరులు విచ్చేయగా కేవలం మూవీ గురించి మాట్లాడి నడిపించేశారు తప్పించి ఎలాంటి ప్రశ్నలు ఎదురుకాకుండా చూసుకున్నారు.

నిజానికి ఈ వారం వస్తున్న సినిమాల లిస్టు ప్రకారం బజ్ రావాల్సిన వాటిలో పురుషోత్తముడు ముందుండాలి. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లాంటి పెద్ద క్యాస్టింగ్ తో పాటు బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు పెట్టారు. కానీ దీని స్థానంలో ధనుష్ డబ్బింగ్ మూవీ రాయన్ కే ఎక్కువ బజ్ కనిపిస్తోంది. మరి ప్రమోషన్లకు టైం లేకపోయినా, రాజ్ తరుణ్ బయట కనిపించే పరిస్థితిలో లేకపోయినా ఇంత హడావిడిగా ఎందుకు రిలీజ్ చేయాల్సి వస్తోందనేది పెద్ద ప్రశ్న. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఓటిటి ఒప్పందం ఒక కారణమై ఉండొచ్చని అంటున్నారు. మూడు రోజుల్లో హైప్ అమాంతం పెంచడం కష్టం.

ఒకవేళ టాక్ మరీ బాగుంటే జనాలు రాజ్ తరుణ్ కేసులో ఉన్న సంగతి మర్చిపోయి మరీ పురుషోత్తముడుని థియేటర్లలో చూస్తారు కానీ అలా జరగకపోతే మాత్రం ఇబ్బందే. కల్కి 2898 ఏడి జోరు తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్ళీ నెమ్మదించేసింది. ప్రేక్షకులను రప్పించే స్థాయిలో ఏవీ అంచనాలు రాబట్టుకోలేకపోయాయి. ప్రియదర్శి డార్లింగ్ డీసెంట్ గా ఉన్నా వర్కౌట్ అయ్యేది కానీ ఆ ఛాన్స్ లేకుండా పోయింది. గోపి సుందర్ సంగీతం, పిజి విందా ఛాయాగ్రహణం, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పని చేసిన ఈ పురుషోత్తముడులో హాసిని హీరోయిన్ గా నటించింది.