తమిళ డబ్బింగ్ సినిమాల తీరు మారదా?

కంగువా.. తమిళ కథానాయకుడు సూర్య నుంచి రాబోతున్న కొత్త చిత్రం. తమిళంలోనే కాక బహు భాషల్లో ఈ చిత్రానికి క్రేజ్ ఉంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన రెండు టీజర్లు చూసిన ఏ ఫిలిం లవర్ అయినా.. ఎంతో క్యూరియస్‌గా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తూ ఉంటాడనడంలో సందేహం లేదు. తెలుగులో కూడా ఈ చిత్రం అక్టోబరు 10న భారీ స్థాయిలో రిలీజయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎగబడతారనడంలో సందేహం లేదు.

మంగళవారం సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘ఫైర్ సాంగ్’ పేరుతో తొలి సింగిల్ రిలీజ్ చేశారు. ఆ పాట వింటే దేవిశ్రీ ప్రసాద్ ఈజ్ బ్యాక్ అనిపించక మానదు. అతను ఎనర్జిటిక్ ట్యూన్ అందించగా.. అనురాగ్ కులకర్ణి హై పిచ్‌లో ఈ పాటను చాలా బాగా పాడాడు. ఇక విజువల్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఫైర్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా రిచ్‌గా ఈ పాటను చిత్రీకరించారు. అన్నింటికీ మించి శ్రీ మణి మంచి లిరిక్స్ అందించాడు. ఆది జ్వాల.. అనంత జ్వాల.. వైర జ్వాల.. వీర జ్వాల.. అంటూ చక్కటి తెలుగు పదాలతో, ప్రాసతో సాగిందీ పాట. కానీ సమస్యంతా ఒక్కటే. సినిమాకు ‘కంగువా’ అనే తమిళ పేరు పెట్టడం.

ఓవైపు శ్రీ మణి లాంటి టాప్ లిరిసిస్ట్‌ను పెట్టి చక్కటి తెలుగు పదాలతో పాట రాయించి మెప్పించిన చిత్ర బృందం.. ఈ సినిమాకు తెలుగులో ఒక టైటిల్ పెట్టకపోవడం విడ్డూరం. ఒకప్పుడు ప్రతి తెలుగు చిత్రానికీ తెలుగులో చక్కటి తెలుగు టైటిళ్లు పెట్టేవారు. అది మస్ట్ అన్నట్లు ఉండేది. కానీ ఈ మధ్య విడ్డూరంగా తమిళ టైటిళ్లే పెట్టి తెలుగులో వదిలేస్తున్నారు. ‘వలిమై’ సహా చాలా సినిమాలు తెలుగులో అవే పేర్లతో రిలీజయ్యాయి.

ఈ శుక్రవారం రిలీజవుతున్న ‘రాయన్’ కూడా అలాగే వస్తోంది. దానికి ‘రాయుడు’ అని పెట్టడం పెద్ద కష్టమా? కనీసం అది పేరు కాబట్టి ఓకే అనుకోవచ్చు. కానీ ‘కంగువా’ అంటే ఏంటో మనకు తెలియదు. వికీపీడియాలో చూస్తే ‘ది మ్యాన్ విత్ ద పవర్ ఆఫ్ ఫైర్’ అని చూపిస్తోంది. దానికి సమానార్థంతో తెలుగులో ఏదో పేరు పెట్టొచ్చు. కానీ ‘కంగువా’ అనే తమిళ పేరు పెట్టి రిలీజ్ చేయడానికి రెడీ అయిపోవడం తెలుగు మీద, తెలుగు ప్రేక్షకుల మీద చిన్న చూపు కాక మరేంటి?