ఏపీలో విద్యుత్ చార్జీల బాదుడు

ఏపీలో విద్యుత్ చార్జీలు పెరిగాయి. సంప‌న్న వ‌ర్గాల‌కు ఇస్తున్న విద్యుత్ యూనిట్ కు 55 పైస‌లు పెర‌గ్గా.. పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌పై మాత్రం భారీ ఎత్తున బాదేశారు. అయితే.. పెంచిన విద్యుత్‌ ఛార్జీలు ఆగస్టు నుంచి అమలులోకి రానున్నాయి. సున్నా నుండి 30 యూనిట్ల వరకు గత ధర రూ.1.45 పైసలు ఉండ‌గా.. మండలి ఆమోదించిన ధర రూ.1.90పైసలుగా ఉంది. దీంతో పెంపు 45 పైసలైంది.  

31 నుంచి 75 యూనిట్ల వరకు రూ.2.09 పైసల నుండి రూ.3.00 పెంపుకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ టారిఫ్‌లో ఉన్న వినియోగ‌దారులు.. 91 పైసల భారం ప‌డ‌నుంది. ఇక‌, 76 యూనిట్ల‌ నుంచి 125 యూనిట్ల వరకు రూ.3.10 నుండి రూ.4.50లకు పెంపున‌కు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. దీంతో యూనిట్కు 1.40 పైసలు చొప్పున పెరిగింది.

అదేవిధంగా 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.4.43 నుండి రూ.6.00 పెంపుకు మండలి ఆమోదం తెలిపింది. దీంతో యూనిట్‌కు రూ.1.57 పైసలు చొప్పున భారం ప‌డింది. ఇక‌, 226  నుంచి 400 యూనిట్ల వరకు రూ.7.59 నుండి రూ.8.75 వరకు పెంపుకు ఆమోదం తెలిపారు. ఫ‌లితంగా యూనిట్ రూ. 1.16 పైసలు, చొప్పున పెర‌గ నుంది.

అదేస‌మ‌యంలో 400 యూనిట్ల పైన రూ.9.20 నుండి రూ.9.75కు పెంపుకు ఆమోదం తెలప‌గా.. యూనిట్ విద్యుత్ పై 55 పైసల చొప్పున భారం ప‌డింది. ఫ‌లితంగా పేద , మధ్య తరగతి ప్రజలకు అదనపు భారం మొప‌గా.. సంపన్నులకు కేవలం పెంచినది 55 పైసలు కావ‌డం గ‌మ‌నార్హం. పేదలకు ఆదాయం పెరుగకపోగా అదనపు భారం పెంపుపై  పేద , మధ్యతరగతి ప్రజలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు ఇలా పెరిగాయి..
30 యూనిట్ల వరకు 45 పైసలు పెంపు
31 నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు
76 నుంచి 125 యూనిట్ల వరకు రూ.1.40 పెంపు
126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.1.57 పెంపు
226 నుంచి 400 యూనిట్ల వరకు రూ.1.16 పెంపు
400 యూనిట్ల పైన యూనిట్‌కు 55 పైసలు పెంపు