రష్యాతో గ్యాస్, చమురు కొనుగోలు తదితరాలపై యూరప్ దేశాలు రష్యాకు పెద్ద షాకిచ్చాయి. గ్యాస్, చమురు కొనుగోలుపై భవిష్యత్తులో రష్యాపై ఆధారపడకూడదు అని యూరోపు దేశాలు డిసైడ్ చేశాయి. ప్రస్తుతం గ్యాస్ కొనుగోలు విషయంలో యూరప్ దేశాలు సగటున 50 శాతం రష్యాపైనే ఆధారపడుతున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధం సందర్భంగా నాటో దేశాలు మద్దతు ఇవ్వకుండా రష్యా నాటో దేశాలను బెదిరిస్తోంది.
రష్యాతో తమకున్న సుదీర్ఘ అవసరాల కారణంగా యూరప్, నాటో దేశాలు కూడా ఉక్రెయిన్ కు ప్రత్యక్షంగా మద్దతుగా యుద్ధంలో దిగలేకపోతున్నాయి. ఈ పరిస్థితిని అమెరికా బాగా అడ్వాంటేజ్ తీసుకున్నది. ప్రస్తుతం యురోపు దేశాల పర్యటనలో ఉన్న జో బిడెన్ తో యురోపు దేశాల సమాఖ్య, నాటో దేశాలు వరుసగా భేటీ అవుతున్నాయి. ఈ భేటీలో యూరప్, నాటో దేశాల గ్యాస్, చమురు అవసరాలను అమెరికా తీరుస్తుందని జో బిడెన్ హామీ ఇచ్చారు.
బిడెన్ హామీతో ఏ ఏ దేశాలకు ఎంతెంత గ్యాస్ అవసరం, చమురు అవసరమో లెక్కలేసుకున్నాయి. దాని ప్రకారం అమెరికాతో ఒప్పందాలు కూడా చేసేసుకున్నాయి. ఈ ఒప్పందాల ప్రకారం మరో రెండేళ్ల తర్వాత నుండి రష్యా నుండి చమురు, గ్యాస్ కొనుగోళ్ళను నిలిపేయాలని యురోపు, నాటో దేశాలు డిసైడ్ చేశాయి. నాటో, యూరప్ దేశాల తాజా నిర్ణయం వల్ల రష్యాకు భవిష్యత్తులో రోజుకు కొన్ని వందల కోట్ల డాలర్ల బిజినెస్ దెబ్బతినటం ఖాయం.
ఇదే సమయంలో యూరప్, నాటో దేశాల అవసరాలు తీర్చేందుకు రోజుకు 15 బిలియన్ క్యూబిక్ మీటర్ల ఉత్పత్తి పెంచాలని అమెరికా నిర్ణయించింది. తాజా ఒప్పందాల వల్ల అమెరికాకు వ్యాపారపరంగా విపరీతమైన లాభాలుంటాయి. ఇదే సమయంలో రష్యాపై ఆర్ధికంగా దారుణమైన దెబ్బ కొట్టినట్లవుతుంది. అంటే గ్యాస్, చమురు సరఫరాను చూపించి నాటో, యురప్ దేశాలను రష్యా రెండేళ్ళ తర్వాత నుండి బెదిరించటం సాధ్యంకాదని తేలిపోయింది.