ముకేశ్ అంబానీ.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ కుబేరుల్లో ముందు వరుసలో ఉంటారు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం.. ఆయన సంపద విలువ 97.4 బిలియన్ డాలర్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్కు సంబంధించి ఆయన తీసుకునే నిర్ణయాలతో పాటు అంబానీ కుటుంబ వ్యక్తిగత జీవిత విశేషాలనూ తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారి దృష్టిని ఆకర్షిస్తోంది ఓ విషయం. అదే.. బుల్లి అంబానీ ‘ప్లేస్కూల్ కహానీ` అంటే.. అంబానీ మనవడు పృథ్వీ అంబానీ స్కూల్ కథ.
ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్కు శ్లోకా మెహతాతో వివాహమైంది. 2020 డిసెంబర్ 10న వారికి పృథ్వీ పుట్టాడు. ఏడాదిన్నర వయసుకే పృథ్వీని ప్లేస్కూల్కు పంపుతున్నారు. ఈ నెలలోనే అతడ్ని ముంబయి మలబర్ హిల్లోని సన్ఫ్లవర్ నర్సరీ స్కూల్లో చేర్చారు. ఆకాశ్, శ్లోక అదే స్కూల్లో తమ విద్యాభ్యాసం ప్రారంభించడం విశేషం.
ముంబయిలో 27 అంతస్తుల విలాసవంతమైన నివాసంలో ఉండే అంబానీ కుటుంబానికి పనివారికి కొదవ లేదు. అయినా.. పృథ్వీ ఆలనాపాలనను ఆయాలకు వదిలేయకుండా, తామే స్వయంగా చూసుకుంటున్నారట ఆకాశ్-శ్లోక. తమ కుమారుడు పెద్దగా స్పాట్లైట్లో లేకుండా, సాదాసీదా జీవితం గడిపేలా చూడాలన్నదే వారి ఆలోచన అని తెలిసింది.
అయితే.. అంబానీ వారసుడు కాబట్టి పృథ్వీకి ఎక్కడకు వెళ్లినా గట్టి బందోబస్తు ఉండాల్సిందే. అందుకే అతడి కోసం పాఠశాలలోనూ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయించారు. కానీ అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలానే.. పృథ్వీ వెన్నంటే 24X7 ఓ వైద్యుడు ఉండేలా చూస్తున్నారు.
అంబానీ మనవడు అయినప్పటికీ.. పృథ్వీని అందరు విద్యార్థులతో సమానంగా చూస్తున్నట్లు చెప్పింది సన్ఫ్లవర్ నర్సరీ స్కూల్ యాజమాన్యం. ఆ పాఠశాల వెబ్సైట్ ప్రకారం.. అతి కొద్ది సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పిల్లల వ్యక్తిగత అవసరాలను దృష్టిలో పెట్టుకుని, కుటుంబ విలువలకు ప్రాధాన్యమిస్తూ విద్యాబోధన చేస్తారు. కళలు, యోగా వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.
గతేడాది డిసెంబర్ 10న పృథ్వీ అంబానీ తొలి పుట్టినరోజు గుజరాత్ జామ్నగర్లో అట్టహాసంగా సాగింది. అతిథుల కోసం ప్రత్యేక విమానాలు, రుచికరమైన వంటలు చేసిపెట్టేందుకు అంతర్జాతీయ స్థాయి షెఫ్లు, ప్రఖ్యాత సింగర్ అరిజిత్ సింగ్ లైవ్ పెర్ఫామెన్స్తో.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకకు రణ్బీర్ కపూర్, ఆలియా భట్, రణ్వీర్ సింగ్, సచిన్ తెందూల్కర్, జహీర్ ఖాన్ వంటి 120 మంది ప్రముఖులు హాజరయ్యారు.