షేన్ వార్న్ మరణంపై కొత్త డౌట్లు

అనూహ్యంగా తెర మీదకు వచ్చిన స్పిన్ మాంత్రికుడు.. దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ 52 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించటం.. క్రీడా ప్రపంచం షాక్ కు గురి కావటం తెలిసిందే. తన ఖాళీ సమయాన్ని సరదాగా గడిపేందుకు థాయ్ లాండ్ వచ్చిన షేన్ వార్న్.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనది సహజ మరణమని.. గుండెపోటుతో విల్లాలోని గదిలో అచేతనంగా పడిపోయి ఉండటం.. ఆ సందర్భంగా ఆయనకు సీపీఆర్ చేసినట్లుగా ఆయన స్నేహితుడు చెప్పటం తెలిసిందే.

తాను వార్న్ తో లంచ్ చేయటం కోసం ఎదురుచూస్తున్నానని.. అతను రాకపోవటంతో అతడి గదిలోకి వెళ్లి చూస్తే.. అచేతనంగా పడి ఉన్నట్లుగా చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వార్న్ మరణంపై థాయ్ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. దీనికి కారణం.. వార్న్ గదిలో అసాధారణ రీతిలో రక్తపు మరకలు ఉండటమే కారణంగా చెబుతున్నారు. గదిలోనూ.. టవల్ మీదా రక్తపు మరకల్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదుచేశారు.  వార్న్ మరణించటానికి ముందు భయాందోళనలకు గురై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గదిలో రక్తపు మరకల గురించి వార్న్ స్నేహితుడ్ని ప్రశ్నించగా.. రూంలో అచేతనంగా పడి ఉన్న వార్న్ కు సీపీఆరర్ చేశామని.. గుండెపై ఒత్తిడి తెచ్చే క్రమంలో రక్తపు వాంతులు అయినట్లుగా చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వార్న్ భౌతికకాయానికి ఆదివారం పోస్టు మార్టం నిర్వహించారు. దీని నివేదికఈ రోజు (సోమవారం) వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ.. పోలీసులు అనుమానిస్తున్నట్లుగా వార్న్ ది సాధారణ మరణం అయితే.. ఆ వివరాలు పోస్టు మార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

వార్న్ భౌతిక కాయం కోసం ఆస్ట్రేలియా ప్రజలు ఎదురుచూస్తున్నారు. అతడికి దేశ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ రోజు (సోమవారం) షేన్ వార్న్ అంత్యక్రియలు పూర్తి అయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్ లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ రికార్డుల్లో నిలిచిన విషయం తెలిసిందే.