షేన్ వార్న్ చివరి క్షణాల్లో ఏం జరిగిందో బయటపెట్టిన మేనేజర్

ప్రపంచ క్రికెట్ లో బౌలర్లు చాలామంది ఉండొచ్చు. కానీ.. షేన్ వార్న్ రోటీన్ కు భిన్నం. అతడి స్పిన్ బౌలింగ్ కు బ్యాట్స్ మెన్లు ఎలా అయితే కంగారు పడి వికెట్లు సమర్పించుకుంటారో.. అతడి జీవనయానం కూడా ఇంచుమించు అలానే ఉంటుంది.

ఏదో ఆశ.. దాన్ని తీర్చుకోవాలనే తాపత్రయం.. అంతలోనే తగిలే ఎదురుదెబ్బలు.. దాని నుంచి నేర్చుకున్న గుణపాఠాలు.. అందుకే మిగిలిన క్రికెటర్లకు కాస్త భిన్నంగా నిలుస్తారు షేన్ వార్న్. 52 ఏళ్ల చిన్న వయసులో.. సరదాగా వెళ్లిన జాలీ ట్రిప్ ఆయన జీవితాన్ని ముగించేలా చేసింది.

వ్యాఖ్యాతగా ఇంగ్లండ్ వెళ్లాల్సిన వార్న్.. తనకు మధ్యలో విరామం దొరకటంతో ఎంచక్కా ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో థాయ్ లాండ్ కు వెళ్లారు. ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా టైం పాస్ చేస్తున్నారు. ఇలాంటి వేళ.. గుండెపోటుతో అతడు మరణించిన వైనం క్రీడా ప్రపంచాన్ని షాకిచ్చింది. ఈ విషాద ఉదంతానికి సంబంధించి అసలేం జరిగిందన్న విషయాన్ని వెల్లడించారు ఆయనకు సుదీర్ఘకాలంగా మేనేజర్ గా వ్యవహరిస్తున్న జేమ్స్ ఎరిక్సన్.

“కామెంటరీ చెప్పేందుకు ఇంగ్లండ్ కు వెళ్లాల్సి ఉంది. ఆ మధ్యలో దొరికిన సమాయాన్ని స్నేహితులతో గడపాలని వార్న్ భావించారు. అందుకు థాయ్ లాండ్ కు వెళ్లారు. ఆ సమయంలో అతను డ్రింక్ తీసుకోలేదు. తన స్నేహితుడు నియోఫిటో తో కలిసి లంచ్ చేద్దామనుకున్నాడు. నిజానికి మరణానికి కాసేపటి ముందు వరకు పాకిస్థాన్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ను చూశాడు. చెప్పిన సమయానికి రెస్టారెంట్ కు రాలేదు. దీంతో.. వార్న్ గదికి నియోఫిటో వెళ్లాడు. అతను వెళ్లే సరికి వార్న్ నిర్జీవంగా పడి ఉన్నాడు” అని చెప్పారు.

“అతనికి ఏదో అయ్యిందని భావించి.. అతనికి సీపీఆర్ చేశాడు. అంబులెన్సుకు సమాచారం అందించాడు. 20 నిమిషాలకు అంబులెన్సు వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లారు. గంట తర్వాత అతను మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. మరణించటానికి రెండు గంటల ముందు అతన్ని చూశాను. ఈ మధ్యన అతను మద్యం ఎక్కువగా తాగటం లేదు. బరువు తగ్గేందుకు ఆహార నియమాలు పాటిస్తున్నాడు. ఆసుపత్రికి తీసుకొచ్చే వేళకే వార్న్ ప్రాణాలు పోయినట్లుగా థాయ్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ వెల్లడించింది” అని జేమ్స్ పేర్కొన్నారు.

వార్న్ ఆకస్మిక మరణం ఆస్ట్రేలియా ప్రజల్ని షాక్ కు గురి చేసింది. ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ చెప్పారు. తమ దేశ అత్యుత్తమ వ్యక్తుల్లో వార్న్ ఒకరుగా ప్రధాని అభివర్ణించారు. ఎంతోమంది అబ్బాయిలు.. అమ్మాయిలు క్రికెట్ ఆడేలా వార్న్ సూర్ఫిగా నిలిచారు. వార్న్ 700 వికెట్ సాదించిన ఎంసీజీ మైదానంలోని ది గ్రేట్ సదర్న్ స్టాండ్ కు అతని పేరు పెట్టాలని విక్టోరియా క్రీడల మంత్రి మార్టిన్ ప్రకటించారు. ఇప్పటికే ఆ గ్రౌండ్ దగ్గర వార్న్ విగ్రహం ఉంది. అతడి మరణ వార్త తెలిసినంతనే పెద్ద ఎత్తున ప్రజలు వార్న్ విగ్రహం వద్దకు చేరుకొని.. పూలు.. క్రికెట్ బాల్స్.. డ్రింక్స్ ను ఉంచి నివాళులు అర్పిస్తున్నారు.