వారిని నమ్ముకుని నిండా మునిగిన ఉక్రెయిన్

నమ్మించి నట్టేట ముంచటమంటే ఉక్రెయిన్ కు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. తన శక్తి ఎంత అన్నది వదిలేసి అరువు కాళ్ళపైన ఆధారపడితే ఏమవుతుందో ఉక్రెయిన్ కు యుద్ధం రెండో రోజే బాగా తెలిసిపోయినట్లుంది. సైనిక శక్తిలో రష్యాను ఏ విధంగాను ఎదిరించి నిలిచేంత సీన్ ఉక్రెయిన్ కు లేదని యావత్ ప్రపంచానికి తెలుసు. అయినా రష్యా మీదకు ఉక్రెయిన కాలుదువ్వింది. తమ మీదకు యుద్ధానికి వస్తే మీ కతేంటో చెబుతానంటూ ఉక్రెయిన్ రష్యాని పదే పదే హెచ్చరించింది.

దాంతో మండిపోయిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం అర్ధరాత్రి ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఇపుడు యుద్ధం చేయలేక ఉక్రెయిన్ కిందా మీదా అవుతోంది. తన దగ్గరున్న పరిమితమైన సైనిక శక్తితోనే పోరాటం చేస్తొంది. క్షేత్రస్థాయిలో పరిస్ధితిని చూస్తుంటే మరో 48 గంటల్లో ఉక్రెయిన్ పూర్తిగా దెబ్బతినటం ఖాయమనే అనిపిస్తోంది. అసలీ పరిస్థితి ఉక్రెయిన్ కు ఎందుకొచ్చింది ? ఎందుకంటే నాటో దేశాలను నమ్ముకుని నట్టేట మునిగింది.

నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనర్ధం. నాటో కూటమిలో 30 దేశాలకు సభ్యత్వముంది. ఈ కూటమికి అమెరికా నాయకత్వం వహిస్తోంది. నాటో దేశాల మధ్య ఉన్న ఒప్పందం ఏమిటంటే ఈ దేశాలపై నాటో కూటమిలో లేని దేశం ఏదన్నా యుద్ధం ప్రకటిస్తే నాటోలోని 30 దేశాలు ఏకమై ప్రత్యర్ధి దేశంపై యుద్ధం చేయాలి. ఇక్కడ గమనించాల్సిందేమంటే నాటో దేశాలకు కామన్ శతృవు రష్యా. రష్యా వల్ల ఉక్రెయిన్ కు ముప్పుంది కాబట్టి రష్యా కనుక యుద్ధం ప్రకటిస్తే నాటో దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలవాలని డిసైడ్ చేశాయి.

ఇక్కడ విచిత్రమేమంటే ఉక్రెయిన్ నాటో కూటమిలో లేదు. కూటమి దేశం కాకపోయినా మద్దతుగా నిలుస్తామని అమెరికా తదితర దేశాలు హామీ ఇచ్చాయి. ఆ హామీని చూసుకునే రష్యాపైన ఉక్రెయిన్ రెచ్చిపోయింది. తీరా యుద్ధం మొదలైన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ నాటో దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. తమ యుద్ధంలో నాటో దేశాలు జోక్యం చేసుకుంటే మీ అంతు చూస్తానన్నాడు. దాంతో నాటో దేశాలన్నీ వెనక్కు తగ్గటంతో ఉక్రెయిన్ కు ఏమి చేయాలో దిక్కుతోచటం లేదు. అందుకనే ఇపుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు నాటో దేశాలు తమను మోసం చేశాయంటు లబోదిబో మంటున్నారు.