ఎక్కడో ఉన్న రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రత పెరిగిపోతోంది. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నదంటే దాని ప్రభావం ఆ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాదు. యావత్ ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయిపోయిన కారణంగా ప్రతి దేశంపైనా ఎంతో కొంత ప్రభావం పడితీరుతుంది. ఆ ప్రభావం ప్రత్యక్షంగా ఎంత పరోక్షంగా ఎంత తీవ్రత చూపుతుందన్నదే సమస్యగా మారిపోతోంది.
ఇపుడు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణాన్నే తీసుకుంటే మరో మూడు వారాలు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మనదేశానికి కూడా ఇబ్బందులు తప్పవు. నిజానికి రష్యా సైనిక శక్తి ముందు ఏ విధంగాను ఉక్రెయిన్ సరిపోదు. అయినా యుద్ధం మొదలైపోయింది కాబట్టి ఇతర దేశాలపై ప్రభావాలు తప్పవు. ఇక మన దేశం సంగతి చూసుకుంటే గోధుమలు, సన్ ఫ్లవర్ ఆయిల్, బార్లీ, టీ పొడి, మొబైల్ ఫోన్ల ధరలు పెరిగి పోవడం ఖాయం.
ఎందుకంటే మన దేశం ప్రతి ఏటా 1.89 మిలియన్ టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 70 శాతం ఉక్రెయిన్, 20 శాతం రష్యా, మిగిలిన 10 శాతం అర్జెంటీనా నుండి వస్తోంది. యుద్ధం కారణంగా రష్యా, ఉక్రెయిన్ నుండి మనకు సరుకు వచ్చే అవకాశం లేదు. పై దేశాల నుండి ప్రతి నెల సగటున 3 లక్షల టన్నుల ఆయిల్ దిగుమతి అవుతోంది. అర్జెంటీనా నుండి మాత్రమే దిగుమతి అయ్యే అవకాశాలున్నాయంతే.
పరిస్థితి ఎప్పటినుండో సమీక్షించుకుంటున్న ఉక్రెయిన్ నుండి మనకు ఫిబ్రవరి మొదటి వారం నుండే సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు ఆగిపోయాయి. యుద్ధం కనుక మరో 2 వారాల్లో ఆగకపోతే మనదేశంలోని సరుకంతా దాదాపు అయిపోవటం, ధరలు పెరిగిపోవటం ఖాయం. గోధుమల పరిస్ధితి కూడా ఇంతే. మనకు దిగుమతయ్యే గోధుమలు రష్యా, ఉక్రెయిన్నుండే వస్తాయి. మన దగ్గర ప్రస్తుతం 24.2 మిలియన్ టన్నుల గోధుమలు మాత్రమే నిల్వలున్నాయి.
మొబైల్ ఫోన్లలో వాడే పల్లాడియం లోహం రష్యా నుండి వస్తోంది. ఇది ఆగిపోవటంతో దీని ప్రభావం మొబైల్ తయారీపై పడటం ఖాయం. ఇక టీ పొడి విషయం తీసుకుంటే మన దగ్గర నుండి ఎగుమతయ్యే టీపొడి అత్యధికంగా రష్యాకే వెళుతోంది. యుద్ధం కారణంగా మిలియన్ టన్నుల టీపొడి నిల్వలు ఇండియాలోనే ఉండిపోతాయి. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే మరో 3 వారాలు యుద్ధం కంటిన్యు అయితేనే. ఈలోగానే యుద్ధం ఆగిపోతే కాస్త అటు ఇటుగా పరిస్థితులు సర్దుకుంటాయి.