కర్ణాటక శివమొగ్గలో దారుణ హత్యకు గురైన భజరంగ్ దళ్ కార్యకర్త అంత్యక్రియల్లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టించాయి. అంతిమయాత్ర సమయంలో కొందరు రాళ్లు రువ్వారు. పలు వాహనాలకు నిప్పంటించి తగులబెట్టారు. ఈ ఘటనలో 10కిపైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. మరికొన్ని వాహనాలు కాలి బూడిదయ్యాయి. అల్లరి మూకల చర్యలతో శివమొగ్గ ఓడీ రోడ్డులో భీతావహ వాతావరణం నెలకొంది.
ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ఆదివారం రాత్రి నుంచే శివమొగ్గలో 144 సెక్షన్ విధించారు అధికారులు. అయినా హింసను ఆపలేకపోయారు. శివమొగ్గలోని సీగెహట్టిలో హర్ష అనే 23 ఏళ్ల భజరంగ్‌దళ్ దళ్ కార్యకర్త ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు యువకులు ఇతనిపై మారణాయుధాలతో దాడి చేసి క్రూరంగా చంపారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. హర్ష మృతిని నిరసిస్తూ పలు సంస్థలు నిరసనకు దిగాయి.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. నిరసనల్లో భాగంగా పలువురు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. వాహనాలను ధ్వంసం చేసి తగులబెట్టారు. దీంతో పోస్టుమార్టం అనంతరం పటిష్ఠ బందోబస్తు నడుమ హర్ష మృతదేహాన్ని అతని నివాసానికి తరలించారు పోలీసులు. హర్ష హత్య కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనను కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు. సీఎం, హోంమంత్రి సొంత జిల్లాలో ఇలా జరగడం ఆందోళనకరమన్నారు. నిందితుడ్ని ఉరి తీయాలని, రాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిజానికి ఒకవైపు… హిజాబ్ గొడవతోనే రాష్ట్ర సర్కారుకు తలనొప్పి ఇప్పటి వరకు తగ్గలేదు. ఇంతలోనే ఈ ఘర్షణలు.. అల్లర్లు జరగడంతో మరింతగా ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యాయనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates