యుద్ధమేఘాలు ఎంతగా కమ్ముకుంటున్నా ఉక్రెయిన్ పై రష్యా ఎందుకని దాడులు మొదలుపెట్టలేదు ? ఉక్రెయిన్ కు మూడువైపులా సైన్యాన్ని మోహరించిన రష్యా ఇంకా ఎందుకని ఆయుధాలను ప్రయోగించలేదు ? ఇపుడిదే ప్రశ్నలు యావత్ ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్నాయి. అయితే యుద్ధానికి దిగుతానని గడచిన 20 రోజులుగా ఉక్రెయిన్ ను బెదిరిస్తున్న రష్యా ఇంతవరకు అలాంటి వాతావరణం సృష్టిస్తోందే కానీ వాస్తవంగా యుద్ధానికి దిగటం లేదు.
నిజంగానే రష్యా యుద్ధానికి దిగటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. అయినా ఎందుకని యుద్ధానికి దిగటం లేదు ? ఎందుకంటే రష్యాకు యుద్ధానికి మధ్య ‘గ్యాస్’ అనే సమస్య ఉందట. రష్యా నుంచి యూరోపులోని చాలా దేశాలకు గ్యాస్ సరఫరా అవుతోందట. ఆ గ్యాస్ పైప్ లైన్లన్నీ కూడా ఉక్రెయిన్ మీదగానే వెళుతున్నాయట. యూరోపు దేశాలు, అమెరికాలోని గ్యాస్ అవసరాల్లో 45 శాతం రష్యానే తీరుస్తోందట. ఇపుడు యుద్ధమంటు మొదలైతే గ్యాస్ ఉత్పత్తి, సరఫరా మొత్తం ఆగిపోతుంది.
బాల్టిక్ సముద్రం లో నుండి జర్మనీని దాటి యూరోపు దేశాలకు వెళ్ళే నార్డ్ స్ట్రీమ్ 1 పైపులైన్ ద్వారా రోజుకు 55 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా అవుతోంది. టర్క్ స్ట్రీమ్ లైన్ ద్వారా రోజుకు మరో 40 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ వెళుతోంది. యుద్ధమంటు మొదలైతే ఇవన్నీ ఆగిపోతాయి. దీని వల్ల చాలా దేశాలు అల్లాడిపోతాయి. ఇదే సమయంలో రష్యాకు రోజుకు 100 కోట్ల డాలర్ల నష్టం వస్తుందట. పైగా గ్యాస్ సరఫరాలో ఉత్పత్తి, సరఫరా ఒప్పందాల ప్రకారం రష్యా చాలా దేశాలకు నష్టపరిహారాన్ని భారీగా చెల్లించాల్సుంటుందని సమాచారం.
శీతాకాలం కారణంగా ఇప్పటికే యూరోపు దేశాలు సరిపడా గ్యాస్ నిల్వలు లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి. దీనికి అదనంగా యుద్ధ వాతావరణం. అందుకనే గ్యాస్ అందుకనే దేశాలన్నీ ఏకమై రష్యాపై యుద్ధానికి వ్యతిరేకంగా ఒత్తిడి పెడుతున్నాయి. రెండు దేశాల మధ్య సమస్యలేమైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోమని పదే పదే చెబుతున్నాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా+మరికొన్ని దేశాల సైన్యం, ఆయుధాలు ఉక్రెయిన్లో దిగాయి. అంటే ఇది కేవలం రష్యాను బెదిరించటానికే అని తెలుస్తోంది. మొత్తం మీద రష్యా యుద్ధమని బెదిరించి ఉక్రెయిన్ ను తనదారికి తెచ్చుకుంటోందని అర్ధమవుతోంది.