కోహ్లీకి ఎందుకంత పట్టుదల?

భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి ఈ మధ్య ప్రతికూల కారణాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. కెరీర్లో ఎన్నడూ లేనంత సాధారణ ఫాంలో ఉన్నాడతను. పూర్తిగా ఫెయిల్ కావట్లేదు. అప్పుడప్పుడూ అర్ధశతకాలు కొడుతున్నాడు కానీ.. అతడి స్థాయికి ఇది సాధారణ ప్రదర్శనే. ఒకప్పుడు సెంచరీల మోత మోగించిన అతను.. రెండేళ్లకు పైగా ఏ ఫార్మాట్లోనూ మూడంకెల స్కోరు చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

దీనికి తోడు అనూహ్య పరిణామాల మధ్య మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాతో చివరి వన్డే సందర్భంగా జాతీయ గీతాలాపన టైంలో చూయింగ్ గమ్ నములుతూ కనిపించి వివాదంలో చిక్కుకున్నాడు విరాట్. ఇలా రోజుకో నెగెటివ్ న్యూస్‌తో విరాట్ జనాల నోళ్లల్లో నానుతున్నాడు. చివరికి తన కూతురు వామిక ఫొటోలు సోషల్ మీడియాలో, మీడియాలో కనిపించడం పట్ల విరాట్ స్పందన పట్ల కూడా జనాలు నెగెటివ్‌గానే రియాక్టవుతున్నారు.

విరాట్ స్థాయి సూపర్ స్టార్ క్రికెటర్‌కు బిడ్డ పుడితే ఫొటోలు చూడాలని అభిమానులకు కచ్చితంగా కోరిక ఉంటుంది. కానీ అతను, అనుష్క మాత్రం ఇప్పటిదాకా కూతురు వామిక ఫొటోలు అధికారికంగా అభిమానులతో పంచుకోలేదు. పైగా తమ కూతురు ఉండగా ఫొటోలు దిగితే తన ముఖం వెనక్కి తిప్పేస్తున్నారు. స్టేడియాలకు అనుష్క కూతురిని తీసుకొచ్చినా.. ఎవరికీ కనిపించకుండా లోపల ఉంటోంది. ఇక విహారానికి వెళ్లినా సరే.. వామిక కెమెరా కళ్లలో పడకుండా చూసుకోవడం పెద్ద టాస్క్ అయిపోయింది విరాట్, అనుష్కలకు.

సోషల్ మీడియాలో ఉండాలా వద్దా అన్నది వామిక ఇష్టమని.. తను పెద్దయ్యాక ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని, అప్పటిదాకా తన ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేయమని, ఎవరూ కూడా తీయొద్దని అంటున్నారు విరాట్, అనుష్క. ఐతే ఒకవేళ వామిక పెద్దదయ్యాక.. ఇంతకాలం తనను లైమ్ లైట్‌కు దూరంగా ఉంచినందుకు ఫీలైతే ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇంత ప్రేమ కురిపించే అభిమానులకు కూతురిని చూసే భాగ్యం లేదా అని ప్రశ్నిస్తున్నారు. కోహ్లి ఫ్యామిలీ ప్రైవసీని గౌరవించాలనడం కరెక్టే కానీ.. మరీ ఇంతలా కూతురిని దాచి పెట్టాలా.. పొరబాటున స్టేడియంలో మ్యాచ్ వీడియో కెమెరా కళ్లల్లో పడి క్యాప్చర్డ్ ఫొటోలు  బయటికి వస్తే దానికి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలా.. అంటున్నారు నెటిజన్లు. ఈ విషయంలో ధోనీలాగా  క్యాజువల్‌గా ఉండొచ్చు కదా.. ఎందుకింత పట్టుదల అని వారు ప్రశ్నిస్తున్నారు.