7వేల కోట్ల అప్పుకు వారసత్వం.. కాఫీతోనే సగం క్లియర్!

మనం తీసుకునే నిర్ణయాలే మనల్ని అదృష్టవంతులుగానో.. దురదృష్టవంతులుగానో డిసైడ్ చేస్తుంది. ఎవరూ శాశ్వత అదృష్ట.. దురదృష్టవంతులు ఉండరన్నది నిజం. ఈ మాటను చెప్పినంతనే నమ్మక పోవచ్చు. కానీ.. ఒక రియల్ స్టోరీతో ఈ మాట్లలోని వాస్తవాన్ని మీరు గుర్తించగలుగుతారు. మాళవిక హెగ్డే.. అన్నంతనే గుర్తుకు రాకపోవచ్చు. ఎక్కడో ఈ పేరును విన్నామని అనుకోవచ్చు. కానీ.. కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ సతీమణిగా.. మాజీ సీఎం కుమార్తె అన్న మాట విన్నంతనే ఆమె ఇట్టే గుర్తుకు వస్తారు.

అప్పుల ఊబిలో దిగబడిపోయి.. బయటకు రాలేక.. ఉక్కిరిబిక్కిరి అయిన వేళ.. మరో మార్గం తోచక ఆత్మహత్య చేసుకోవటానికి ముందు వరకు మాళవిక హెగ్డేను అదృష్టానికి కేరాఫ్ అడ్రస్ గా భావించేవారు. ఎప్పుడైతే ఆయన ఆత్మహత్య వార్త బయటకు వచ్చిందో.. ఆమె దురదృష్టాన్ని తలుచుకోని వారు లేరు. ఇంకా స్థిరపడని పిల్లలు.. భర్త ఆత్మహత్య.. మొత్తం ప్రతికూల వాతావరణం.. అన్నింటికి మించి ఉక్కిరిబిక్కిరి చేసే రూ7వేల కోట్ల అప్పులు. ఇలాంటివేళ.. ఆమె పరిస్థితి పగోడికి కూడా రాకూడదని భావించారు. మరోవైపు.. తమను నమ్ముకున్న వేలాది మంది ఉద్యోగులు. ఇలాంటివేళ.. ఆమె వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆమెను మరోలా చూస్తున్నాయి.

ఏడాదిన్నర క్రితం ఎదురైన ఆమె పరిస్థితి చూసినప్పుడు.. భయంకరమైన తుపాను వేళ నడి సంద్రంలో చిక్కుకున్న నావలా మారితే.. స్థిరచిత్తంతో.. తనకున్న తెలివి.. కాలం పెట్టిన పరీక్ష అంతు చూడాలన్న తపన.. కలిసి ఆమె గురించి మళ్లీ అందరూ మాట్లాడేలా చేశాయి. కాఫీడే పగ్గాల్ని తాను స్వీకరించిన నాటి నుంచి ఏడాదిలోనే ఆమె సంస్థకు ఉన్న రూ.3వేల కోట్ల అప్పుల్ని తీర్చేయటం ద్వారా ఆమె హాట్ టాపిక్ గా మారారు.

మాళవిక హెగ్డే.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. క్రిష్ణ కుమార్తె. 1991లో ఆమెకు కాఫీ వ్యాపారవేత్త వీజీ సిద్దార్థతో పెళ్లైంది. ఇద్దరు కలిసి కాఫీడే ఔట్ లెట్లను ఓపెన్ చేయాలని భావించారు. నిజానికి ఆ ఆలోచన సిద్ధార్ధదే. మొదట మాళవికకు చెబితే.. ఆమె నో చెప్పారు. కారణం.. బజార్లో రూ.5కు దొరికే కాఫీని రూ.25 పెట్టి తమ ఔట్ లెట్లో ఎందుకు తాగుతారు?అన్నది ఆమె ప్రశ్న. దీనికి సిద్ధార్థ కోసం ఆలోచనలో పడ్డాడు. చివరకు కాఫీతో పాటు ఫ్రీగా ఇంటర్నెట్ ఇస్తే? అన్న ఆలోచనను పంచుకోవటంతో.. ఆమె ఓకే చేశారు. అలా మొదటి కేఫ్ కాఫీ డే అవుట్ లెట్ ను బెంగళూరులో 1996లో షురూ చేశారు.

ఆ తర్వాత దేశ వ్యాప్తంగా.. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్ని చోట్ల దీని ఔట్ లెట్లను స్టార్ట్ చేయటం తెలిసిందే. దేశీయ ఆతిథ్య రంగంలో పేరున్న సంస్థగా కేఫ్ కాఫీ డే ఎదిగింది. దాని బ్రాండ్.. ఒక నమ్మకంగా మారింది. ఇలాంటి వేళ.. 2019 జులైలో మొత్తం సీన్ మారింది. అప్పటివరకు బయటకు పెద్దగా రాని అప్పుల కొండ బరువును మోయలేని సిద్దార్థ.. ఆత్మహత్య చేసుకొని తన దారిన తాను శాశ్వితంగా వెళ్లిపోయారు. కాఫీ కింగ్ గా పేరున్న ఇంటి పెద్ద.. వెళ్లిపోయిన వేళ.. కంపెనీ బ్యాలెన్స్ షీట్లలో కనిపించిన రూ.7వేల కోట్ల అప్పును చూసి.. ఇక పని అయిపోయిందనుకున్నారు.

ఒకదశలో జీతాల కోసం ఉద్యోగులు ధర్నాలు..నిరసనలు చేసిన పరిస్థితి. ఇదే సమయంలో లాక్ డౌన్ మరిన్ని పరీక్షల్ని పెట్టింది. అలాంటి వేళ.. సంస్థకు ఉన్న 24 వేల మంది ఉద్యోగుల బాధ్యతను తీసుకుంటూ మాళవిక కేఫ్ కాఫీడేలోకి ఎంట్రీ ఇచ్చారు. సంస్థను ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్నారు. రూ.7వేల కోట్ల అప్పులకు తానే బాధ్యురాలని చెప్పి.. సంస్థ సీఈవో బాధ్యతల్ని చేపట్టారు. ఓవైపు కొవిడ్.. మరోవైపు ఆర్థిక కష్టాలకుచెక్ పెట్టేందుకు ఆమె విపరీతంగా శ్రమించారు. అనవసర ఖర్చులకు చెక్ చెప్పారు. పెట్టుబడులు తగ్గించుకోవటానికి ఎన్నో వెండింగ్ మెషిన్లను వెనక్కి తీసుకొచ్చారు. సంస్థకు ఉన్న నిరర్ధక ఆస్తులన్నీ అమ్మేశారు. ఏడాది తిరిగేసరికి సంస్థకు ఉన్న రూ.3వేల కోట్ల అప్పును తిరిగి చెల్లించేశారు. కొత్త ఆశలు చిగురించేలా చేశారు. సంస్థకు పూర్వ వైభవం తిరిగి వస్తుందన్న ఆశను అందరిలోనూ పెంచారు. ఇప్పుడు చెప్పండి మాళవిక అదృష్టవంతురాలా? దురదృష్టవంతురాలా?