ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్ని కొత్త పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ లోనూ కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. తాత్కాలిక ప్రాతిపదికన కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. తాజాగా తీసుకొచ్చిన నిబంధనల్లో అత్యధికంగా ఆటగాళ్ల ఆరోగ్యానికి మేలు చేసేవి.. మహమ్మారి ప్రమాదం నుంచి తప్పించేవి కావటం గమనార్హం.
అనిల్ కుంబ్లే నాయకత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ చేసిన ఈ ప్రతిపాదనలు ఓకే అయ్యాయి. ఇంతకీ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ లోకి వెళితే..
- బంతి మెరుపు పెంచేందుకు వీలుగా ఏ బౌలర్ కూడా ఉమ్మిని వాడకూడదు. ఈ రూల్ ను ఆటగాళ్లు అలవాటు పడే వరకూ కాస్త స్వేచ్ఛ ఉంటుంది. తొలుత బంతికి ఉమ్మి రాస్తే.. వార్నింగ్ ఇస్తారు. రెండు వార్నింగ్ ల తర్వాత ఐదు పరుగులు పెనాల్టీ వేస్తారు.
- టెస్టు మ్యాచ్ జరిగే వేళలో ఎవరికైనా క్రీడాకారుడికి కోవిడ్ 19 రోగ లక్షణాలు కనిపిస్తే.. అతనికి బదులుగా రీప్లేస్ మెంట్ ఉంటుంది. సదరు ఆటగాడి స్థానంలో మరో ఆటగాడిని అంపైర్ అంగీకారంతో ఆడించొచ్చు.
- ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇతర దేశాలకు చెందిన తటస్థ అంపైర్లకు బాధ్యతలు ఇవ్వటం కష్టం కావటంతో.. ఆయా క్రికెట్ బోర్డులకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎలైట్ ప్యానెల్ అంపైర్లే మ్యాచ్ విధులు నిర్వర్తిస్తారు.
- స్థానిక అంపైర్లకు అనుభవం తక్కువగా ఉండటంతో నిర్ణయాల్లో తప్పులు దొర్లే ప్రమాదం ఉంది. అందుకే.. అదనంగా మరో రివ్యూకు అవకాశం ఇస్తారు. దీంతో..టెస్టుల్లో ఒక్కో ఇన్నింగ్స్ కు రెండుకు బదులుగా మూడు.. వన్డే.. టీ20లకు ఒకటి నుంచి రెండు రివ్యూలకు అనుమతిస్తారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates