‘బుల్లీబాయ్’లో అమ్మాయి అరాచకం?

కొత్త సంవత్సరం ఎంట్రీ ఇచ్చినంతనే దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఉదంతాల్లో బుల్లీ బాయ్ ప్రధానమైంది. ఈ అరాచకపు యాప్ లో జరిగే దారుణాల గురించి తెలిసిన పలువురు నోరెళ్లబెట్టే పరిస్థితి. మరీ.. ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. దేశంలో చైతన్యవంతంగా ఉండే ముస్లిం మహిళల్ని టార్గెట్ చేస్తూ..  వారి ఫోటోల్ని మార్పింగ్ చేయటం.. రాయలేని దారుణ రాతలతో వారి ఫోటోల్ని వేలం పేరుతో పైశాచిక ఆనందాన్ని పొందే వైనం వెలుగు చూసి.. అందరిని షాక్ కు గురి చేసింది.

ఈ అరాచకపు యాప్ లో కీలకం ఎవరన్న దానిపై మహారాష్ట్ర పోలీసులు ఫోకస్ చేయటం.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవటంతో డొంక కదిలింది. ఈ యాప్ గురించి శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విటర్ లో తీవ్రంగా పేర్కొన్న తర్వాత నుంచి ఈ యాప్ మీద అందరి చూపు పడింది. ఇదో హాట్ టాపిక్ గా మారింది. శివసేన ఎంపీ ట్వీట్ కు కేంద్రం రియాక్ట్ కావడం.. మైక్రోసాఫ్ట్ అనుబంధ గిట్ హబ్ ను సంప్రదించి.. బుల్లీబాయ్ ను బ్లాక్ చేయించారు. అనంతరం దీని మూలాల మీద పోలీసులు ఆరా తీయటం షురూ చేశారు.

ఇందులో భాగంగా తాము సంపాదించిన సాంకేతిక ఆధారాలతో ముంబై సైబర్ సెల్ పోలీసులు సోమవారం బెంగళూరులోని విశాల్ కుమార్ అనే ఇంజనీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం అతడ్ని అరెస్టు చేశారు. ముంబయికి తీసుకొచ్చి కోర్టులో హాజరు పర్చగా.. రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. దీని ప్రకారం ఉత్తరాఖండ్ కు చెందిన ఒక మహిళ ఈ ఉదంతంలో కీలకమని గుర్తించారు.

ఆ మాటకు వస్తే ఆమే.. ప్రధాన నిందితురాలిగా పోలీసులు చెబుతున్నారు. తాజాగా ఆమెను అదుపులోకి తీసుకున్న ముంబయి పోలీసులు ఆమెను స్థానిక కోర్టులో హాజరుపరిచి.. ట్రాన్సిట్ వారెంట్ మీద ముంబయికి తీసుకురానున్నారు. ఈ బుల్లీ బాయ్ కు ముందు.. ఇదే తరహాలో సల్లీ డీల్స్ యాప్ ను నిర్వహించారు. అప్పట్లో కంప్లైంట్లు వచ్చి.. పోలీసులు కేసులు నమోదు చేసినా.. నిందితుల్ని అదుపులోకి తీసుకోవటం అలసత్వం ప్రదర్శించారు. అప్పట్లోనే ఆ పని చేసి ఉంటే.. ఈ రోజున బుల్లీ బాయ్ వరకు విషయం వచ్చేది కాదంటున్నారు. ఏమైనా మహిళల్ని దారుణంగా చిత్రీకరించే ఈ యాప్ వెనుక ఒక మహిళే ఉండటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆమె ఎందుకిలా చేస్తుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంటుంది.