ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఆ మాటకు వస్తే.. ఆయన అసమాన్యమైన త్రి దళాలకు అధిపతి. అలాంటి ప్రముఖుడు ప్రయాణించే హెలికాఫ్టర్.. ఆయన జర్నీ సమయంలో వాతావరణం ఎలా ఉందన్న విషయాన్ని ఎంత పక్కాగా తనిఖీ చేయాలి. ప్రమాదానికి ఏ చిన్న అవకాశం ఉన్నప్పటికీ ఆయన్ను ప్రయాణానికి అనుమతించకూడదు. కానీ..ఆయన ప్రయాణిస్తున్న సైనిక హెలికాఫ్టర్ ప్రమాదానికి చోటు చేసుకోవటం.. ఆయనతో సహా 13 ముంది దుర్మరణం పాలైన ఉదంతం భారీ షాకిచ్చింది.
ఇంతకీ.. ఈ భారీ ప్రమాదానికి కారణం ఏమిటి? సాంకేతిక కారణమా? ప్రతికూల వాతావరణమా? మరింకేదైనా కారణం ఉందా? అన్న అంశంపై ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఆధ్వర్యంలో ‘కోర్టు ఆఫ్ ఎంక్వయిరీ’ని నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదిక తాజాగా సిద్ధమైంది. దీన్ని త్వరలోనే ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరికి సమర్పించనున్నారు.
ప్రస్తుతం సిద్ధం చేసిన నివేదికను వైమానిక దళానికి చెందిన న్యాయవిభాగం పరిశీలిస్తోంది.
అయితే.. ఈ నివేదికలోని అంశాలపై అటు ప్రభుత్వం కానీ ఇటు వైమానిక దళం కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.కాకుంటే..ఈ నివేదికలోని అంశాలు బయటకు వచ్చాయి. ఈ ఘోర ప్రమాదానికి కారణం.. సాంకేతిక అంశం కానీ మెషనరీ పొరపాట్లు కావని.. కేవలం ప్రతికూల వాతావరణం మాత్రమేనని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.
డిసెంబరు 8న తమిళనాడులోని కూనూర్ కు సమీపంలో రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ17వీ5 హెలికాఫ్టర్ అనుకోని రీతిలో ప్రతికూల వాతావరణంలోకి వెళ్లి చిక్కుకుపోవటం.. బిపిన్ రావత్ తో సహా మొత్తం 13 మంది బలి కావటం తెలిసిందే. మరి.. అంత పెద్దాయన ప్రయాణించే వేళ.. ప్రతికూల వాతావరణాన్ని ఎందుకు సరిగా అంచనా వేయలేదు? దానికి బాధ్యత వహించేవారెవరు. అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరి.. ఈ అంశాలపై నివేదికలోఏం పేర్కొన్నారో బయటకు రావాల్సి ఉంది.