ఆసుపత్రి బిల్లుబకట్టలేదని తాళ్లతో కట్టేశారు

చికిత్స సంగతి ఎలా ఉన్నా.. బిల్లు కట్టించుకునే విషయంలో ఆసుపత్రులు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. మనిషి ప్రాణం పోయినా.. బిల్లు లెక్క తేలే వరకూ డెడ్ బాడీని ఇచ్చేందుకు సైతం ఒప్పుకోని దవాఖానాల గురించి తెలిసిందే.

తాజాగా.. ఒక ఆసుపత్రి వ్యవహారం షాకింగ్ గా మారింది. మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.సదరు ఆసుపత్రి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజ్ గర్ జిల్లాకు చెందిన 80 ఏళ్ల పెద్ద వయస్కుడికి పేగు సంబంధిత వ్యాధితో షాజాపూర్ లోని సిటీ హాస్పిటల్ లో చేరారు. చికిత్స పూర్తి అయిన తర్వాత ఆసుపత్రి వారు వేసిన బిల్లు చూసిన ఆయన కుటుంబ సభ్యులకు చుక్కలు కనిపించాయి. అంత డబ్బు లేదని.. బిల్లు విషయంలో కాస్త తగ్గించాలని వేడుకున్నారు. తాము చెప్పిన బిల్లును కట్టకుంటే డిశ్చార్జ్ చేసే ప్రసక్తే లేదని తేల్చిన ఆసుపత్రి యాజమాన్యం దారుణానికి పాల్పడింది.

బిల్లు కట్టలేదన్న కారణంగా పేషెంట్ ను తాళ్లతో కట్టేసింది. పెద్ద వయసు దానికితోడు అనారోగ్యాన్ని పరిగణలోకి తీసుకోని ఆసుపత్రి చర్యతో అవాక్కు అయ్యారు. అయితే.. ఈ తాళ్లతో కట్టేసిన ఫోటో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఈ ఫోటోను చూసినోళ్లంతా షాక్ కు గురయ్యే పరిస్థితి. ఆసుపత్రుల ఆరాచకానికి నిలువెత్తు రూపంగా ఈ ఫోటో ఉందన్న మాట వినిపిస్తోంది.

ఈ ఫోటోను చూసిన మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఇస్తూ.. సదరు పేషెంట్ బకాయిల్లో ఒక్కరూపాయి కూడా తీసుకోకుండానే డిశ్చార్జి చేసినట్లుగా ట్వీట్ చేసింది. చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడిలా వివరణ ఇవ్వటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.