దేశాన్ని ఇపుడు ఒమైక్రాన్ వేరియంట్ వణికించేస్తోంది. గడచిన ఏడాదిన్నరగా దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ తగ్గిపోతోంది కదాని రిలాక్సుడుగా ఉంటే హఠాత్తుగా ఒమైక్రాన్ విరుచుకుపడుతోంది. కరోనా వైరస్ కన్నా పదిరెట్లు ప్రమాధకరమైన కొత్త వేరియంట్ తో ఇప్పటికే 35 దేశాలు వణికిపోతున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి విదేశాలకు వెళ్ళిన వారిని వెతికి పట్టుకోవడం, పరీక్షలు నిర్వహించడం, అంతవరకు వారిని క్వారంటైన్ సెంటర్లలో పెట్టడం ఇపుడు పెద్ద సమస్యగా మారిపోయింది.
ఒమైక్రాన్ మొదట గుర్తించింది దక్షణాఫ్రికాలోనే కాబట్టి ఆ దేశానికి చాలా దేశాలు విమాన ప్రయాణాలను రద్దు చేసుకున్నాయి. అయితే అప్పటికే దక్షిణాఫ్రికా నుండి వివిధ దేశాల్లోకి ప్రవేశించిన వారి కోసం ఆయా దేశాలు వెతుకుతున్నాయి. ఇందులో భాగంగానే మనదేశంలోకి కూడా చాలామందే దిగారు. ఇపుడు వీరందరిని ట్రేస్ చేసేపనిలో ఉన్నతాధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 21 ఒమైక్రాన్ కేసులు బయటపడ్డాయి. వీటిలో రాజస్థాన్ లోని జైపూర్ లోనే 9 కేసులు బయటపడటంతో రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు.
జైపూర్లో బయటపడిన తొమ్మిది కేసుల్లో నలుగురు ఒక మ్యారేజీకి హాజరవ్వటంతో అధికారుల్లో టెన్షన్ బాగా పెరిగిపోతోంది. వీరి అంచనా ప్రకారం మ్యారేజిలకు హాజరైన వారిలో ఒమైక్రాన్ కేసులు ఎన్ని బయటపడతాయో చూడాలి. వీళ్ళు కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, బెంగళూరు, ఢిల్లీలో కూడా ఒమైక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు ఒమైక్రాన్ సోకిన వారి ఆరోగ్య పరిస్ధితి, వ్యాధి లక్షణాల్లో నిర్దిష్ట లక్షణాలేవీ నిపుణులు చెప్పటం లేదు. ఎందుకంటే ఒక్కో నిపుణుడు ఒక్కో విధంగా చెబుతుండటంతో మామూలు జనాల్లో అయోమయం పెరిగిపోతోంది.
ఒకవైపు ఒమైక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం టెన్షన్ పడుతుంటే మరోవైపు కరోనా వైరస్ కేసులు కూడా ఎక్కువైపోతున్నాయి. తెలంగాణాలోని కరీంనగర్ మెడికల్ కాలేజీలోనే 43 మందికి కరోనా వైరస్ నిర్ధారణవ్వటంతో కాలేజీని అర్ధాంతరంగా మూసేశారు. అలాగే కొన్ని ఆశ్రమ స్కూళ్ళల్లోని విద్యార్ధులకు కూడా కరోనా పాజిటివ్ బయటపడింది. దీంతో కేసులు బయటపడిన విద్యాసంస్ధలను ప్రభుత్వం మూయించేస్తోంది. దీనికితోడు జనవరి-ఫిబ్రవరిలో మూడో వేవ్ రావచ్చని ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ చేసిన ప్రకటన టెన్షన్ పెంచేస్తోంది.