అవును చదవటానికి, వినటానికి విచిత్రంగానే ఉన్న ఒక సర్వేలో తేలింది మాత్రం ఇదే. ఒకవైపు మహిళల రక్షణకు ప్రభుత్వాలు గృహ హింస చట్టాలను చేసింది. మహిళలు, యువతలపై జరుగుతున్న దాడులకు రక్షణకు అనేక చట్టాలను చేసింది. కోర్టులు కూడా బాధిత మహిళల విషయంలో సానుభూతిని చూపుతున్నాయి. అయితే ఇదే సమయంతో భార్యలను భర్తలు కొట్టడం తప్పే కాదని అభిప్రాయం వ్యక్తమైంది. ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది పురుషులు కాదు సుమా.
స్వయంగా మహిళలే పై అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే జరిగింది. ఈ సర్వేని 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించారు. మహిళల అభిప్రాయాలను తెలుసుకోవటమే లక్ష్యంగా సర్వే జరిగింది. అనేక అంశాలపై జరిగిన సర్వేలో భార్యలను భర్తలు కొట్టడం అనే విషయంపైన కూడా ఓ ప్రశ్న ఉంది. సర్వే కాబట్టి తమను భర్తను కొట్టడంపై మహిళలు రెచ్చిపోతారని సర్వే చేసిన వాళ్ళు అనుకున్నారట.
అయితే వాళ్ళు ఊహించని విధంగా భార్యలను భర్తులు కొట్టడం తప్పేకాదని 84 శాతం మంది భార్యలు సమర్ధించారట. భార్యలను భర్తలు కొట్టడాన్ని సమర్ధించిన వాళ్ళల్లో అత్యధికులు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారట. తర్వాత కర్నాటక, మణిపూర్, కేరళ, జమ్మూ-కాశ్మీర్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ నిలిచాయి. అయితే అతితక్కువ మంది భార్యలు మాత్రం భర్తలు కొట్టడాన్ని సమర్ధించిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అట.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే భార్యలను భర్తలు కొట్టే పరిస్ధితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముందు భార్యలపైనే ఉందని కూడా చాలామంది అభిప్రాయపడటం. ఇల్లు, పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండే భార్యలను, అత్త, మామలను, భర్త సోదరులు, భర్త తరపు బంధులను గౌరవించని భార్యలను కొట్టడం తప్పే కాదని స్వయంగా భార్యలే అభిప్రాయపడటం గమనించాలి. అంటే మహిళల రక్షణకు చట్టాలు కల్పించినంత మాత్రాన ఉపయోగం లేదని తాజా సర్వేలో బయటపడింది.
అన్నింటికన్నా విచిత్రం ఏమిటంటే భార్యలను భర్తలు కొట్టడాన్ని మెజారిటి భర్తలు వ్యతిరేకించారట. భార్యలను భర్తలు కొట్టడం తప్పని స్పష్టంగా అభిప్రాయపడిన రాష్ట్రం కర్నాటక. ఒకవైపేమో భార్యలను కొట్టడం తప్పని భర్తలు అభిప్రాయపడుతుంటే, మరోవైపు భార్యలను భర్తలు కొట్టడం తప్పే కాదని భార్యలు అభిప్రాయాలు వ్యక్తం చేయటం చాలా విచిత్రంగా ఉంది. సమస్య వచ్చినపుడు భార్య-భర్తలు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయని అభిప్రాయపడిన దంపతులు కూడా ఉన్నారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates