రాబిన్ హుడ్ బాగానే దోచాడు.. కానీ

రాబిన్ హుడ్ అంటే పెద్దోళ్లను దోచుకుని పేదోళ్లకు పెట్టేవాడు. ఈ పేరుతో ఓ తెలుగు సినిమా తెరకెక్కింది. రెండుసార్లు వాయిదా పడ్డాక ఎట్టకేలకు మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐతే ఈ ‘రాబిన్ హుడ్’ కూడా బాగానే దోచుకున్నాడు. కానీ అతను దోపిడీ చేసింది నిర్మాతలు, బయ్యర్ల దగ్గరే. ప్రేక్షకులను మాత్రం ఆశించినంతగా దోచుకోలేకపోయాడు. దీంతో లెక్క తప్పి నిర్మాతలు, బయ్యర్లు గట్టి దెబ్బ తినే పరిస్థితి నెలకొంది. నితిన్ మార్కెట్ స్థాయికి మించి ఈ సినిమా మీద చాలా ఎక్కువే ఖర్చు పెట్టేశారు. 70-80 కోట్ల దాకా బడ్జెట్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

నితిన్ వరుస ఫ్లాపుల్లో ఉన్నా సరే.. ‘భీష్మ’ కాంబినేషన్ కావడంతో వెంకీ కుడుముల మీద భరోసాతో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు బడ్జెట్ కొంచెం ఎక్కువే పెట్టారు. సినిమా ఆలస్యం కావడం, రిలీజ్ వాయిదా పడడం వల్ల బడ్జెట్ ఇంకా పెరిగింది. దీంతో ‘రాబిన్ హుడ్’ మీద బాక్సాఫీస్ భారం బాగా పెరిగిపోయింది.

పైగా మార్చి చివరి వారంలో తీవ్రమైన పోటీ మధ్య సినిమా రిలీజైంది. ఓవైపు మ్యాడ్ స్క్వేర్.. ఇంకోవైపు ఎంపురాన్, వీర ధీర శూర.. ఇలా రెండు వైపులా పోటీ తప్పలేదు. ‘మ్యాడ్ స్క్వేర్’ క్రేజ్ ‘రాబిన్ హుడ్’ను బాగానే దెబ్బ తీసింది. దానికి కూడా యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్లు బాగున్నాయి. ‘ఎంపురాన్’, ‘వీర ధీర శూర’ కూడా కొంతమేర డ్యామేజ్ చేశాయి. ఇటు చూస్తే ‘రాబిన్ హుడ్’కు బ్యాడ్ టాక్ వచ్చింది. దీంతో సినిమా రేసులో బాగా వెనుకబడిపోయింది.

తొలి రోజు ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ సాధించిన నితిన్ సినిమా.. రెండో రోజే పడుకుంది. ఆదివారం కలెక్షన్లు పర్వాలేదు. మొత్తంగా చూస్తే వీకెండ్లోనే సినిమా అండర్ పెర్ఫామ్ చేసింది. ఇక సోమవారం నుంచి సినిమా మీద పెద్దగా ఆశలు లేనట్లే కనిపిస్తోంది. రంజాన్ సెలవైనా సరే సోమవారం బుకింగ్స్ చాలా డల్లుగా కనిపిస్తున్నాయి. చూస్తుంటే బయ్యర్ల పెట్టుబడిలో సగం కూడా రికవర్ అయ్యేలా లేదు. ‘పుష్ప-2’ భారీ సక్సెస్ సాధించడంతో జోష్ మీద ఉన్న మైత్రీ అధినేతలకు ‘రాబిన్ హుడ్’ బాగానే గండి కొట్టేలా ఉంది.