మురుగదాస్.. ఒకప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. రమణ, గజిని, గజిని (హిందీ), తుపాకి, కత్తి లాంటి బ్లాక్ బస్టర్లతో మురుగదాస్‌కు మామూలు డిమాండ్ ఉండేది కాదు. కానీ మహేష్ బాబుతో ‘స్పైడర్’ చేసిన దగ్గర్నుంచి ఆయన కెరీర్ తిరగబడింది. తర్వాత సర్కార్, దర్బార్ లాంటి డిజాస్టర్లు వచ్చాయి ఆయన్నుంచి. దీంతో ఒకప్పుడు మురుగదాస్‌తో సినిమాలు చేయడానికి ఎగబడ్డ స్టార్లే తర్వాత ముఖం చాటేశారు. కొన్నేళ్ల పాటు మురుగదాస్ కెరీర్‌లో గ్యాప్ వచ్చేసింది.
ఐతే ఈ ఖాళీ తర్వాత ఒకటికి రెండు క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడు మురుగ. అందులో ఒకటి సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘సికందర్’ కాగా.. మరొకటి శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మదరాసి’. ఈ రెండు చిత్రాల విషయంలో ఆయా హీరోల ఫ్యాన్స్ అంత సంతృప్తిగా లేరు. అనవసరంగా మురుగతో జట్టు కడుతున్నారని వాళ్లు ఫీలయ్యారు.
బాలీవుడ్లో అసలే ఫ్లాపుల్లో కొట్టు మిట్లాడుతున్న సల్మాన్ ఖాన్ ‘సికందర్’తో మరింత కిందికి వెళ్లిపోయాడు. మరోవైపు గత కొన్నేళ్లలో చాలా వేగంగా ఎదిగిన శివ.. గత ఏడాది ‘అమరన్’ సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఇలాంటి టైంలో కెరీర్‌ను ఇంకాస్త పైకి తీసుకెళ్లే దర్శకుడితో అతను సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ అతను ఫాంలో లేని మురుగదాస్‌నే నమ్మాడు. ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచి శివ ఫ్యాన్స్ టెన్షన్ పడుతునే ఉన్నారు. ఇలా ఔట్ డేట్ అయిపోయిన డైరెక్టర్లతో సినిమా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో చాలా ఉదాహరణలు ఉన్నాయి.
ఐతే ‘సికందర్’తో మురుగదాస్ సత్తా చాటితే.. ‘మదరాసి’ మీద కొంచెం ఆశలు రేగేవి. కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. దీంతో ‘మదరాసి’ మీద అంచనాలు ఇంకా తగ్గిపోయాయి. దాని బిజినెస్ మీద కూడా ప్రభావం పడబోతోంది. శంకర్ ఇలాగే ‘గేమ్ చేంజర్’ చేస్తూ ‘ఇండియన్-2’ కూడా తీశాడు. అది డిజాస్టర్ అయింది. దాని ఎఫెక్ట్ ‘గేమ్ చేంజర్’ మీద పడింది. చివరికి అదీ తేడా కొట్టింది. మరి ‘సికందర్’తో దెబ్బ తిన్న మురుగ.. ‘మదరాసి’తో ఏమాత్రం బౌన్స్ బ్యాక్ అవుతాన్నడది చూడాలి.