ప్రపంచ సంపన్నుల పేర్లు చెప్పమంటే చటుక్కున చెప్పేస్తాం. అలాంటిది ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఏవి? అన్న ప్రశ్నను వేస్తే మాత్రం సమాధానం కోసం తడుముకోక తప్పదు. ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్.. టెస్లా వ్యవస్థాపకుడు ఏలాన్ మాస్క్.. అంటూ పేర్లు చెబుతాం. అయితే.. వీరంతా కూడా ఒక్క తరంలోనే ఇంతటి సంపదను క్రియేట్ చేశారు. కానీ.. కొన్ని కుటుంబాలు మాత్రం తరతరాలుగా వ్యాపారాల్లో మునిగి తేలుతూ.. అపార సంపదను స్రష్టించి.. అత్యంత సంపన్న కుటుంబాలుగా కీర్తి ప్రతిష్టల్ని సొంతం చేసుకున్నారు. మన దేశంలో టాటాలు.. బిర్లాలు.. అంబానీ కుటుంబాలుగా చెప్పొచ్చు.
టాటా కుటుంబం విషయానికి వస్తే జెమ్ షెడ్జీ టాటాతో మొదలైన ప్రస్థానం రతన్ టాటా కొనసాగిస్తున్నారు. ముకేశ్ అంబానీకి ఇంత బలాన్ని.. శక్తిని అందించింది ఆయన తండ్రి ధీరూభాయ్ అంబానీనే. ఆయన మొదలు పెట్టిన రిలయన్స్ ప్రస్థానాన్ని ముకేశ్ విజయవంతంగా నడిపిస్తుంటే.. అనిల్ అంబానీ అందుకు భిన్నమైన పరిస్థితుల్లో ఉండటం తెలిసిందే. ఇక.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటాప్ త్రీ సంపన్న కుటుంబాలు అమెరికాలోనే ఉండటం విశేషంగా చెప్పాలి.
- వాల్టన్ ఫ్యామిలీ
ప్రపంచ ప్రజల్లో అత్యధికులకు తెలిసిన సూపర్ మార్కెట్ ఏదైనా ఉందంటే వాల్ మార్ట్ అని చెప్పాలి. ఇంతలా పాపులర్ అయిన సూపర్ మార్కెట్ చెయిన్ ప్రపంచంలో మరొకటి లేదనే చెప్పాలి. దీని వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్. దశాబ్దాల క్రితం మొదలైన ఈ మహా వ్యాపార సామ్రాజ్యం నేడు వాల్టన్ కుటుంబంలోని ఐదో తరం వారసులు నిర్వహిస్తున్నారు. వారి కుటుంబ సంపద విలువ 205 బిలియన్ డాలర్లుగా చెబుతారు. ఇది అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆస్తుల విలువ కంటే ఎక్కువ. - మార్స్ కుటుంబం
సుమారు వందేళ్ల క్రితం ఫ్రాంక్ మార్స్.. తన పేరు మీద చాక్లెట్ల కంపెనీని షురూ చేశారు. తర్వాతి రోజుల్లో అదే కంపెనీ నుంచి వచ్చిన స్నిక్కర్స్.. ఎం అండ్ ఎం డోవ్ లాంటి చాక్లెట్లను ఈ సంస్థే తయారు చేసింది. తొలుత పెంపుడు జంతువులకు సంబంధించిన ఉత్పత్తుల ద్వారానే ఆ కంపెనీకి అధిక ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థను ఐదో తరం వారసులు నిర్వహిస్తున్నారు. వీరి కుటుంబ సంపద విలువ 141 బిలియన్ డాలర్లుగా చెబుతారు. - ఖోక్ ఫ్యామిలీ
ఫ్రెడ్ ఖోక్ స్థాపించిన చమురు సంస్థతో మొదలైన ఈ చమురు ఉత్పత్తి.. ఖోక్ కుటుంబాన్ని తిరుగులేని సంపన్న కుటుంబంగా మార్చింది. ఈ కంపెనీని ఆయనకు చెందిన నలుగురు కొడుకులు సొంతం చేసుకున్నారు. తర్వాతి కాలంలో ఇద్దరు కొడుకులు వ్యాపారం నుంచి తప్పుకోగా.. మిగిలిన ఇద్దరు ఈ వ్యాపార సంస్థను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చార్ల్స్ ఖోక్ కంపెనీ బోర్డు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఖోక్ కుటుంబ ఆస్తుల విలువ 124 బిలియన్ డాలర్లుగా చెబుతారు.