భక్తులకు వెళ్లేందుకు ఓకే.. ప్రార్థనాలయాల్లో ఇవేమీ ఉండవు

ఓవైపు లాక్ డౌన్ 5.0. మరోవైపు అన్ లాక్ 1.0ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల ఎనిమిది నుంచి దేవాలయాలు.. మసీదులు.. చర్చిలకు భక్తుల్ని అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇందులో భాగంగా పలు నిబంధనల్ని తాజాగా తీసుకొచ్చింది. ఏ మతానికి చెందిన వారైనా సరే.. వారి.. వారి ప్రార్థనాలయాలకు వెళ్లే వారు ఏమేం చేయాలి.. ఏమేం చేయకూడదన్న దానిపై ఒక స్పష్టత ఇచ్చింది.

ఈ నిబంధనల్ని చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. గుడి.. మసీదు.. చర్చి.. ఏదైనా కావొచ్చు. అక్కడికి వెళ్లామన్న ఫీలింగే తప్పించి.. అక్కడ దేన్ని తాకే వీల్లేదు. అంతేనా.. గుళ్లలో ఇచ్చే చటారు.. ఆక్షింతలు.. తీర్థం.. ప్రసాదం.. ఇలాంటివేమీ పంచకూడదు.

కొన్ని ప్రార్థనాలయాల్లో భక్తులమీద చల్లే పవిత్ర జలాల్ని చల్లకూడదు. ఇక.. దేన్ని తాక కూడదు. మూతికి మాస్కులు తప్పనిసరి. అన్నదానాలు.. ప్రత్యేకంగా జరిపే పూజలు.. క్రతువులు.. ఇలాంటివేమీ చేయకూడదు.

వయసుమళ్లిన వారు.. గర్భిణిులను అనుమతించరు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోపలకు అనుమతిస్తారు. సామూహిక గీతాలు.. భజనలు.. ప్రార్థనలకు అనుమతులు ఇవ్వరు. ప్రార్థనాలయాల్లో వెలుతురు.. స్వచ్ఛమైన గాలి వచ్చేలా వెంటిలేషన్ ఏర్పాటుతో పాటు..రికార్డింగ్ ద్వారానే భజనల్ని పెట్టాల్సి ఉంటుంది.

మొత్తంగా చూస్తే.. ప్రార్థనాలయాలకు వెళ్లి వచ్చామన్న ఫీలింగ్ తప్పించి.. మరింకేమీ ఉండవు. దీనికన్నా.. ఇంట్లోనే ఎవరి ప్రార్థనలు వారు చేసుకోవటానికి మించింది ఉండదేమో?