టీమ్ ఇండియా నిష్క్రమించడమే బెటర్!

ఎన్నెన్నో ఆశలు.. ఎన్నెన్నో అంచనాలు. అన్నీ కూలిపోయాయి. టీ20 ప్రపంచకప్‌ను గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతారనుకుంటే.. మనోళ్లు సెమీస్ గడప కూడా తొక్కేలా లేదు. సూపర్-12 దశలోనే నిష్క్రమించడం దాదాపుగా ఖాయం అయిపోయింది. వన్డేల్లో అయినా, టీ20ల్లో అయినా ప్రపంచకప్‌లో పాకిస్థాన్ మీద ఓడిన చరిత్రే లేని ఘన రికార్డును కొనసాగిస్తూ చిరకాల ప్రత్యర్థిని మరోసారి చిత్తు చేసేస్తారనుకుంటే.. మరీ దారుణంగా 10 వికెట్ల తేడాతో ఆ జట్టు చేతిలో ఓడి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు.

ఐతే ఎప్పుడూ ఒక జట్టే గెలవాలనుకుంటే అదెలా సాధ్యం అవుతుందిలే అని అభిమానులు సర్దిచెప్పుకున్నారు. ఆ ఓటమిని మరిచిపోయి తర్వాతి మ్యాచ్‌కు రెడీ అయ్యారు. పాక్‌తో ఓటమి తర్వాత తప్పులు దిద్దుకుని న్యూజిలాండ్‌పై చెలరేగుతారని.. సెమీస్ రేసులోకి వస్తారని అనుకుంటే.. మరింత పేలవమైన ప్రదర్శనతో ఇంకో ఘోర పరాజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

ఈ దెబ్బతో ఇండియా సెమీస్ చేరడం దాదాపు అసాధ్యం అనే అనిపిస్తోంది. కాకపోతే సాంకేతికంగా మాత్రం భారత్ రేసులో ఉంది. భారత్ ముందంజ వేయడానికి టెక్నికల్‌గా అవకాశాలు లేకపోలేదు. మిగతా మూడు మ్యాచుల్లో అఫ్గానిస్థాన్, నమీబియా, స్కాట్లాండ్‌లపై ఘనంగా గెలిచి.. మరోవైపు న్యూజిలాండ్ ఈ మూడు జట్లలో ఏదో ఒక దాని చేతిలో ఓడిపోతే కోహ్లీసేన సెమీస్ చేరుతుంది. న్యూజిలాండ్ లాంటి పెద్ద జట్టు మామూలుగా అయితే ఈ మూడు జట్లలో దేని చేతిలోనూ ఓడదు. అఫ్గాన్ ప్రమాదకర జట్టు కాబట్టి ఆ మ్యాచ్‌లో ఓడటానికి కొంచెం అవకాశాలున్నాయి. కానీ అలాంటి అద్భుతాలు ఎప్పుడో కానీ జరగవు.

ఐతే ప్రపంచకప్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి పాకిస్థాన్, న్యూజిలాండ్‌ల చేతిలో చిత్తుగా ఓడిన టీమ్ ఇండియా.. ఇప్పుడిలాంటి అద్భుతాల మీద ఆశలు పెట్టుకోవాల్సి రావడం.. వేరే జట్ల ఫలితాల మీద ఆధారపడి సెమీస్ చేరాల్సి రావడం ఒక రకంగా దౌర్భాగ్యం అనే చెప్పాలి. సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం, అసంతృప్తి ఎలా ఉందంటే.. ఇలా సెమీస్ చేరడం కంటే టీమ్ ఇండియా టోర్నీ నుంచి నిష్క్రమించి వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్ మీద ఫోకస్ చేయడం బెటర్ అంటున్నారు. తొలి రెండు మ్యాచుల్లో ఘోరంగా ఆడిన కోహ్లీసేనకు కప్పు గెలిచే అర్హత లేదని అభిప్రాయపడుతున్నారు.