అతి చేసిన పాక్ లెజెండ్.. క్షమాపణలు చెప్పాడు

“మ్యాచ్ సందర్భంగా హిందువుల మధ్య రిజ్వాన్ నమాజ్ చేయడం నన్నెంతగానో ఆకట్టుకుంది”.. ఇదీ పాకిస్థాన్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనస్ ఆదివారం నాడు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ పూర్తయ్యాక చేసిన వ్యాఖ్యలు.

మూడు దశాబ్దాల వ్యవధిలో వన్డే ప్రపంచకప్‌లో కానీ, టీ20 ప్రపంచకప్‌లో కానీ ఎన్నడూ పాకిస్థాన్ ఇండియాపై గెలిచిందే లేదు. వన్డే ప్రపంచకప్‌లో ఏడుసార్లు, టీ20 ప్రపంచకప్‌లో ఐదుసార్లు పాక్‌ను మట్టికరిపించి ఘనమైన రికార్డుతో కొనసాగతూ వచ్చింది భారత్. ఐతే ఈ రికార్డు ఆదివారం నాడు చెరిగిపోయింది. పాకిస్థాన్ తొలిసారిగా ప్రపంచకప్‌లో ఇండియాను ఓడించింది. దీంతో పాకిస్థానీల ఆనందానికి అవధుల్లేకపోయాయి. ఈ టైంలో సంబరాలు చేసుకోవడంలో ఎవరికీ అభ్యంతరాల్లేవు. కానీ ఈ టైంలో పాక్ మద్దతుదారులు కొందరు చేస్తున్న అతే చర్చనీయాంశం అయింది.

తన స్థాయి చూసుకోకుండా వకార్ యూనస్ పైన చెప్పుకున్నట్లే సిల్లీ కామెంట్ చేశాడు. ఆటకు, మతానికి ముడిపెట్టి.. మైదానంలో హిందువుల మధ్య నమాజ్ చేయడం గొప్ప అన్నట్లుగా మాట్లాడాడు. పాకిస్థానీయుల మత ఛాందసవాదానికి ఇది రుజువు.. దాదాపు ఇరవై ఏళ్లు క్రికెట్ ఆడిన లెజండరీ క్రికెటర్ ఇలాంటి ఛాందసవాదంతో ఉంటూ ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ అతడిపై వివిధ దేశాల క్రికెటర్లు, విశ్లేషకులు విరుచుకుపడ్డారు.


ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే .. వకార్ తీరును తప్పుబడుతూ అతను క్షమాపణలు చెబితే బాగుంటుందని.. ఆటలోకి మతాన్ని తీసుకురావడం ఏంటని వ్యాఖ్యానించాడు. ఐతే వకార్ తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తాడా.. క్షమాపణలు చెబుతాడా.. అలా చేసి పాక్‌లో మత పెద్దల ఆగ్రహానికి గురవుతాడా అన్న చర్చ జరిగింది. కానీ వకార్ తన వ్యాఖ్యలపై ఇప్పుడు విచారం వ్యక్తం చేశాడు. అప్పుడేదో ఆవేశంలో అలా మాట్లాడేశానని.. అవి ఎవరినీ ఉద్దేశించి చేసన వ్యాఖ్యలు కావని.. ఎవరి సెంటిమెంట్లనూ దెబ్బ తీసే ఉద్దేశం తనకు లేదని.. ఆటలు ప్రజల్ని ఏకం చేస్తాయని.. మతం, రంగు, జాతి వంటి వాటికి ఆటల్లో చోటు లేదని వ్యాఖ్యానించి తన తప్పును సరిదిద్దుకున్నాడు వకార్.