న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓడితే..?

వన్డే ప్రపంచకప్‌లో ఏడుసార్లు.. టీ20 ప్రపంచకప్‌లో ఐదుసార్లు.. ఇలా చిరకాల ప్రత్యర్థితో ప్రపంచకప్‌ల్లో తలపడ్డ 12 సార్లు భారత్‌దే విజయం. 13వ పర్యాయం కూడా మనదే జయకేతనం అని చాలా ధీమాగా ఉన్నారు అభిమానులు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. మొన్నటి టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో కోహ్లీ సేన మరీ చిత్తుగా 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ చేతిలో పరాజయం పాలైంది. ఈ దెబ్బతో టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ చేరే అవకాశాలు కూడా సంక్లిష్టం అయ్యాయి.

గ్రూప్-బి నుంచి ఇండియా ముందుగా సెమీస్ బెర్తు ఖరారు చేసుుకంటుందని, రెండో బెర్తు కోసం పాకిస్థాన్, న్యూజిలాండ్ కొట్టుకోవాల్సిందే అని ముందు అనుకుంటే.. ఇప్పుడు పాకిస్థాన్ మంచి స్థితికి వెళ్లింది. భారత్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో వచ్చే ఆదివారం న్యూజిలాండ్‌ను ఢీకొనబోతోంది.

ఈ మ్యాచ్ ఇండియాకు డు ఆర్ డై అనడంలో సందేహం లేదు. ఈ మ్యాచ్ కూడా ఓడితే తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే. ఎందుకంటే తర్వాత మూడు మ్యాచ్‌ల్లో అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాలను ఢీకొనబోతున్న భారత్.. వాటి మీద గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.

ఎందుకంటే ఇవి చిన్న జట్లు కాబట్టి పాకిస్థాన్, న్యూజిలాండ్ కూడా వాటిని సులువుగానే ఓడించే అవకాశముంది. ఆ రెండు జట్లు అప్పటికే భారత్ మీద ఒక్కో విజయం సాధించాయి కాబట్టి.. మూడు చిన్న జట్లపై సాధించిన విజయాలతో కలిపి తలో నాలుగు గెలుపులు సాధించినట్లు అవుతుంది. తమ ముఖాముఖి మ్యాచ్‌లో గెలిచిన జట్టు మొత్తంగా ఐదు విజయాలతో గ్రూప్‌లో అగ్రస్థానం సాధిస్తే.. ఇంకో జట్టు నాలుగు విజయాలతో రెండో స్థానం సాధించి ముందంజ వేస్తుంది.


భారత్ అప్పుడు మూడు విజయాలతో మూడో స్థానానికి పరిమితం అవుతుంది. న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడాక కూడా ముందంజ వేయాలంటే.. అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాల చేతిలో ఏదో ఒక మ్యాచ్‌లో పాకిస్థాన్ లేదా న్యూజిలాండ్ ఓడిపోవాలి. ఆ ఓడిపోయే జట్లు తమ ముఖాముఖి మ్యాచ్‌లోనూ ఓడాలి. అప్పుడే భారత్‌కు ఛాన్సుంటుంది. అలా జరగడం అంత తేలిక కాదు కాబట్టి న్యూజిలాండ్ మీద గెలవడం భారత్‌కు అత్యవసరం.