వారం వ్యవధిలో జరిగిన బిగ్ సేల్ లెక్క వింటే దిమ్మ తిరగాల్సిందే

పెద్ద పండగ్గా చెప్పుకునే దసరాకు బిగ్ సేల్ పేరుతో ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్.. ఫ్లిప్ కార్ట్ లు పోటాపోటీగా నిర్వహించే స్పెషల్ సేల్ లో రికార్డు స్థాయి అమ్మకాలు జరిగాయి. మొత్తం నెల పాటు సాగే ఫెస్టివల్ సేల్ లో మొదటి వారంలోరికార్డుస్థాయి అమ్మకాలు జరగటం విశేషం. గత ఏడాది కరోనా కారణంగా అమ్మకాలు మందకొడిగా సాగగా.. ఈసారి ఆ లోటును పూడ్చేసేలా అదిరే అంకెలతో.. అమ్మకాలు సాగినట్లుగా వివరాలు వెల్లడిస్తున్నాయి.

ప్రముఖ కన్సెల్టింగ్ సంస్థ రెడ్ సీర్ లెక్కల ప్రకారం.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు రెండు కలిసి తమ మొదటి వారం అమ్మకాలు దాదాపుగా రూ.32వేల కోట్లకు పైనే జరిపినట్లుగా తెలుస్తోంది. దసరా ఫెస్టివ్ సీజన్ భారీ అమ్మకాలకు కారణమైందన్న మాట వినిపిస్తోంది. అక్టోబరు 3 నుంచి అక్టోబర్ 10 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తే.. అక్టోబరు 4 నుంచి నుంచి గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ ను అమెజాన్ షురూ చేసింది.

భారీ ఎత్తున డిస్కౌంట్లు.. ఎక్ఛ్సేంజ్ ఆఫర్లను ప్రకటించటంతో వినియోగదారులు భారీగా కొనుగోళ్లు చేసినట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు.. కరోనా కారణంగా ఇంటి నుంచి ఆన్ లైన్ లో కొనుగోళ్లు చేయటం అన్ని నగరాల్లోనూ.. టైర్ టు.. త్రీ సిటీస్ లోనూ ఎక్కువైంది. మొదటి వారంలో జరిగిన రూ.32వేల కోట్ల అమ్మకాల్ని చూస్తే..అందులో సింహభాగంగా స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు భారీగా సాగినట్లు చెబుతున్నారు. ప్రతి గంటకు రూ68 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్మకాలు జరిగాయి.

ఇది దాదాపు 32 శాతం వృద్ధిని నమోదు చేసినట్లుగా చెప్పాలి. ఇక.. ఈ బిగ్ సేల్ లో అత్యధికంగా అమ్మకాలు జరిపింది ఫ్లిప్ కార్ట్. తన మార్కెట్ వాటా 64 శాతానికి దగ్గరగా ఉంటే.. అమెజాన్ వాటా తక్కువగా ఉన్నట్లుగా చెబుతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అమ్మకాలు భారీగా పెరిగాయి. గత ఏడాది ప్రతి కస్టమర్ కొనుగోలు సగటు రూ.4980గా ఉంటే.. ఈసారి అది కాస్తా రూ.5034కు పెరిగినట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా పెద్ద పండగ సందర్భంగా నిర్వహించే పెద్ద అమ్మకాల జాతరలో ఈ-కామర్స్ సంస్థలు అదరగొట్టేశాయని చెప్పక తప్పదు.