ఐపీఎల్ రేసు.. ర‌స‌వ‌త్త‌రంగా ఉందే

ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ 14వ సీజ‌న్ లీగ్ ద‌శ చివ‌రి స్టేజ్‌కు వ‌చ్చేసింది. అన్ని జ‌ట్లూ 11-12 మ్యాచ్‌లు మ‌ధ్య ఆడేశాయి. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు చాలా ముందుగానే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్ర‌మించింది. చెన్నై సూప‌ర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆల్రెడీ ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధించాయి. ఇక మిగిలిన రెండు బెర్తులు ఎవ‌రివ‌న్న‌దే తేలాల్సి ఉంది. 11 మ్యాచ్‌ల్లో 7 విజ‌యాలు సాధించిన బెంగ‌ళూరు జ‌ట్టు ప్లేఆఫ్స్‌కు అడుగు దూరంలో ఉంది. ఆదివారం ఆ జ‌ట్టు పంజాబ్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌బోతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. బెంగ‌ళూరుకు ప్లేఆఫ్ బెర్తు ఖ‌రారైపోతుంది.

ఇక చివ‌రి బెర్తు ఎవ‌రిద‌న్న‌దే తేలాల్సి ఉంది. దీని కోసం నాలుగు జ‌ట్లు రేసులో ఉండ‌టం విశేషం. ఆ నాలుగు జ‌ట్లూ స‌మాన స్థితిలో ఉండ‌టం గ‌మ‌నార్హం. చివ‌రి ప్లేఆఫ్ బెర్తును ఆశిస్తున్న ముంబ‌యి ఇండియ‌న్స్, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, పంజాబ్ కింగ్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్.. ఈ నాలుగు జ‌ట్లూ త‌లో 12 మ్యాచ్‌లు ఆడాయి. ఐదేసి విజ‌యాలు సాధించాయి. ఏడు చొప్పున ఓట‌ములు చ‌విచూశాయి. నెట్ రన్‌రేట్ కొంచెం అటు ఇటుగా ఉంది కానీ.. విజ‌యాలు, ఓట‌ముల్లో స‌మానంగా ఉన్న ఈ నాలుగు జ‌ట్లూ ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితిలో ఉన్నాయి.

ఐతే వీటిలో వీటికి కూడా మ్యాచ్‌లు ఉండ‌టంతో ప్ర‌తి మ్యాచ్ ఉత్కంఠ‌భ‌రితంగా మార‌డం ఖాయంగా ఉంది. ఈ చివ‌రి బెర్తు ఎవ‌రిదో తెలియాలంటే లీగ్ ద‌శ చివ‌రి మ్యాచ్ వ‌ర‌కు ఎదురు చూడ‌క త‌ప్పేలా లేదు. మునుపెన్న‌డూ లేని ఉత్కంఠ ఈసారి చూడ‌బోతున్నామ‌నిపిస్తోంది. వ‌రుస‌గా గ‌త‌ రెండేళ్లు ఛాంపియ‌న్‌గా నిలవ‌డ‌మే కాక‌.. మొత్తంగా ఐదు టైటిళ్ల‌తో ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్టుగా కొన‌సాగుతున్న ముంబయి.. ఈసారి ప్లేఆఫ్ బెర్తు కోసం ఇంత క‌ష్ట‌ప‌డాల్సి రావ‌డం ఆశ్చ‌ర్య‌మే. మ‌రి చివ‌రి బెర్తు ఆ జ‌ట్టు సొంత‌మ‌వుతుందా.. లేక మిగ‌తా మూడు జ‌ట్ల‌లో ఒక‌దానికి ద‌క్కుతుందా అన్న‌ది ఆస‌క్తిక‌రం.