వర్క్ ఫ్రం హోంపై వెనక్కి తగ్గిన గూగుల్..




అంతా బాగున్నట్లే ఉంటుంది. ఫర్లేదు.. పరిస్థితులు చక్కబడుతున్నాయన్నంతనే మరో కొత్త వేరియంట్ విరుచుకుపడటం.. అప్పటివరకు ఉన్న ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారితో ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ప్రపంచం మొత్తం ఎదుర్కొంటోంది. దీంతో.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వర్కు ఫ్రం హోం పేరుతో ఐటీ కంపెనీలు నిర్ణయం తీసుకోవటం.. కరోనా నేపథ్యంలో గడిచిన ఏడాదిన్నరగా ఇలాంటి పరిస్థితే నెలకొంది.

ఇటీవల పరిస్థితులు చక్కబడుతున్నట్లు కనిపిస్తున్న నేపథ్యంలో చాలా కంపెనీలు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాలంటూ ఉత్తర్వులు జారీ చేశాయి. అయితే.. థర్డ్ వేవ్ భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. ఇంతకాలం వర్కు ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చిన కంపెనీలు మరికొన్ని నెలలు ఇస్తే పోయేదేమిటన్న ఉద్యోగుల మాటల్ని కంపెనీలు పట్టించుకోలేదు.

ప్రపంచంలో అత్యుత్తమ కంపెనీల్లో ఒకటైన గూగుల్ సైతం తన ఉద్యోగుల్ని తొలుత అక్టోబరు నుంచి రమ్మని చెప్పి.. ఆ తర్వాత దాన్నిసెప్టెంబరు ఒకటికి మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా మూడో వేవ్ విరుచుకుపడటం.. పెద్ద ఎత్తున కేసులు నమోదువుతున్నాయి పలు దేశాల్లో. మన దేశంలోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నా.. కేరళలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా కేసులు నమోదు కాని పరిస్థితి. దీంతో.. కంపెనీలకు ఉద్యోగుల్ని రమ్మని చెప్పాలా? వద్దా? అన్న సందేహంగా మారింది. అయితే.. కొద్దిరోజులుగా ప్రపంచంలోని పలు దేశాల్లో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో తాజాగా పలు కంపెనీలు తమ ఆదేశాల్ని వెనక్కి తీసుకుంటున్నాయి.

తాజాగా నెంబర్ వన్ సెర్చి ఇంజిన్ గూగుల్ సైతం తన ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. తాను గతంలో చెప్పినట్లు కాకుండా 2022 జనవరి వరకు వర్కుఫ్రం హోంను కంటిన్యూ చేయాలని కోరింది. అదే సమయంలో కంపెనీలకు వచ్చి పని చేయటం అనేది ఉద్యోగుల ఇష్టానికి వదిలేసింది. తాజాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఒక మొయిల్ ను ఉద్యోగులకు పంపారు.

2022 జనవరి 10 తర్వాత వివిధ దేశాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వర్కు ఫ్రం హోం కొనసాగించాలా? ఆఫీసులకు వచ్చి పని చేయాలా? అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. గుగూల్ బాటలోనే అమెజాన్.. లైఫ్ట్ లాంటి కంపెనీలతో సహా పలు కంపెనీలు ఇదే తీరును ప్రదర్శిస్తున్నాయి. మొన్నటిదాకా ఉద్యోగులు ఆఫీసులకు రావాలన్న దానికి భిన్నంగా.. వర్కు ఫ్రం హోంను కంటిన్యూ చేయాలని కోరుతున్నాయి.