హైదరాబాద్ క్రికెట్ నుంచి ఒకప్పుడు ఎం.ఎల్.జయసింహా, మహ్మద్ అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి దిగ్గజాలు వచ్చారు. వాళ్లు భారత క్రికెట్లో సాధించిన ఘనతల గురించి చెప్పడానికి చాలా ఉంది. ముఖ్యంగా అజహర్, వీవీఎస్‌లది ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మేటి ఆటగాళ్ల జాబితాలో చేర్చగల స్థాయి. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకోవడానికి ముందు వరకు అజహర్ ప్రతిష్ఠ అత్యున్నత స్థాయిలోఉండేది. ఫిక్సింగ్ ఆరోపణల్ని పక్కన పెడితే ఆటగాడిగా అజహర్ స్థాయి గొప్పది.
ఇక వీవీఎస్ సంగతి చెప్పాల్సిన పని లేదు. 2001 నాటి ఈడెన్ గార్డెన్స్ ఇన్నింగ్స్‌తో క్రికెట్ చరిత్రలో తనకో ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడతను. అంబటి రాయుడు కూడా వీరి స్థాయిలో మేటి క్రికెటర్ అవుతాడనుకున్నారు రకరకాల కారణాల వల్ల అతను ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయాడు. మధ్యలో హనుమ విహారి టీమ్ ఇండియా స్థాయికి ఎదిగాడు కానీ తనదైన ముద్ర వేయలేకపోయాడు.
ఐతే ఇప్పుడు మరో హైదరాబాదీ క్రికెటర్ టీమ్ ఇండియాలో అత్యంత కీలకమైన ఆటగాడిగా ఎదుగుతున్నాడు. అజహర్, లక్ష్మణ్‌ల మాదిరి భవిష్యత్తులో దిగ్గజం అయ్యేలా కనిపిస్తున్నాడు. అతనే.. మహ్మద్ సిరాజ్. పాత బస్తీలో చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన అతను.. దేశవాళీ క్రికెట్లో సంచలన ప్రదర్శనతో ఐపీఎల్‌లో అవకాశం దక్కించుకోవడం.. ఆ తర్వాత వేగంగా టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవడం తెలిసిందే. ముందు టీ20ల్లో ఆడిన పెద్దగా రాణించలేకపోయాడు. కానీ 2019 చివర్లో ఆస్ట్రేలియా పర్యటన అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ పర్యటన సమయంలోనే తన తండ్రి చనిపోయినా.. కొవిడ్ నిబంధనల వల్ల ఇండియాకు రాకుండా ఆస్ట్రేలియాలోనే ఉండిపోయిన సిరాజ్.. భారత్ తొలి టెస్టులో చిత్తుగా ఓడి పరాభవం ఎదుర్కొన్న సమయంలో రెండో టెస్టులో అవకాశం దక్కించుకుని ఐదు వికెట్లతో అదరగొట్టాడు. జట్టు సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆ సిరీస్ అంతా కూడా నిలకడగా రాణించి భారత్ చారిత్రక విజయాన్నందుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలోనూ సిరాజ్ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. డ్రాగా ముగిసిన తొలి టెస్టులోనూ రాణించిన సిరాజ్.. లార్డ్స్‌లో భారత్ అద్భుత విజయాన్నందుకున్న రెండో టెస్టులో అత్యంత కీలకంగా మారాడు. ఈ మ్యాచ్‌లో అతను 8 వికెట్లు తీయడం విశేషం. ముఖ్యంగా చివరి రోజు ఎంతో ఉత్కంఠ రేపిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో రెండుసార్లు రెండేసి వికెట్లతో.. మొత్తంగా నాలుగు వికెట్లతో సిరాజ్ చేసిన ప్రదర్శనను ఏ భారత క్రికెట్ అభిమానీ మరిచిపోలేదు. సిరాజ్ మరో స్థాయి బౌలర్ అని నిన్ననే రుజువైంది. ఇదే నిలకడను కొనసాగిస్తే సిరాజ్.. హైదరాబాద్ నుంచి అజహర్, లక్ష్మణ్ తరహాలో ఇంకో లెజెండ్ అవడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates