మోడల్స్ ను అలా చూపించొద్దు.. కేరళ గవర్నర్

మిగిలిన రాష్ట్రాలకు కాస్త భిన్నమైన రాష్ట్రంగా కేరళను చెప్పాలి. సంపూర్ణ అక్షరాస్యత ఉన్న ఆ రాష్ట్రంలో ఆడ మగ అన్న తేడా కాస్త ఎక్కువే. ముఖ్యంగా పెళ్లి వేళ.. పెండ్లి కుమార్తె తల్లిదండ్రులకు పెద్ద పరీక్ష ఎదురవుతుందని చెబుతారు. కట్నంగా భారీ ఎత్తున బంగారాన్ని తీసుకెళ్లే సంప్రదాయం ఎక్కువ. పెళ్లి కుమార్తెకు తక్కువలో తక్కువ అంటే అరకేజీకి పైనే బంగారు నగలతో ముస్తాబు కావటం చాలా చోట్ల కనిపిస్తుంది.

తాజాగా కేరళలో వెలుగు చూసిన వరకట్న బాధితురాలి వ్యవహారం సంచలనంగా మారింది. సంపూర్ణ అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో వరకట్న దురాచారం కారణంగా ఒకరు బలి కావటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వరకట్నం మీద కేరళ సమాజంలో హాట్ చర్చ సాగుతున్న వేళ.. రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఊహించని విధంగా వ్యవహరించారు. బాధిత మహిళ విషయంలో ఆయన స్పందించిన తీరు అందరిని ఆకర్షించింది.

వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా ఆయన ఒక రోజు ఉపవాస దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు ఆభరణాల కంపెనీలు తాము తయారు చేసే ఆభరణాల ప్రకటనల్లో ఒంటి నిండా బంగారం వేసుకునేలా మోడల్స్ ను చూపించొద్దన్నారు. తాజాగా ఆయన కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ సెవన్త్ కాన్వొకేషన్ వేడుకకు గవర్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మరోసారి ఆయన తన గళాన్ని విప్పారు.

బంగారు ఆభరణాల ప్రకటనల్లో మోడల్స్ ను పెళ్లి కుమార్తెలుగా చూపించొద్దన్నారు. యాడ్స్ లో పెళ్లి కుమార్తెకు నిండుగా నగలు ఉన్నట్లు చూపించటం ద్వారా తప్పుడు సంకేతాలు వెళుతున్నాయన్నారు. ‘ఆభరణాల ప్రకటనల్లో మోడల్స్ ను పెళ్లి కుమార్తెలుగా కాకుండా మరోలా చూపించాలి. అప్పుడు మాత్రమే మైండ్ సెట్ మారే వీలుందని చెబుతున్నారు.

బంగారు షాపుల యాడ్స్ లో.. పెళ్లి కుమార్తెకు భారీగా నగలు ధరించాలన్నట్లు చూపిస్తారని.. దీంతో. పెళ్లి కుమార్తె అన్నంతనే ఈ భారీతనం.. అట్టహాసం తప్పనిసరి అన్న భావన కలుగుతుందన్నారు. అందుకే పెళ్లి కుమార్తెలతో యాడ్స్ చేసేటప్పుడు బంగారు నగలు భారీగా వేసుకున్నట్లు చూపించొద్దన్నారు. అంతేకాదు.. కళాశాల కాన్వొకేషన్ కోసం వెళ్లిన ఆయన.. విద్యార్తుల చేత వరకట్నం తీసుకోమంటూ ప్రతిజ్ఞ చేయించారు. వారి చేత అండర్ టేకింగ్ కూడా తీసుకోవటం విశేషం. మొత్తానికి కేరళ రాష్ట్ర గవర్నర్ మిగిలిన వారికి భిన్నమన్న విషయం తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇట్టే చెప్పేస్తున్నాయని చెప్పాలి