కిమ్ తలకు గాయం.. ఏమైంది..?

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కొన్ని రోజులు అయితే.. ఏకంగా ఆయన చనిపోయాడంటూ కూడా వార్తలు వచ్చాయి. కొన్నిరోజులు ఆయన కనిపిచంచకపోడంతో.. ఆయనకు ఆరోగ్యం బాలేదా..? లేక చనిపోయారా అంటూ తీవ్రంగా చర్చించుకున్నారు. ఈ వార్తలకు పులిస్టాప్ పెడుతూ కొన్ని ఫోటోలు కూడా విడుదల చేశారు. అయినా.. ఆ పుకార్లు మాత్రం ఆగలేదు.

అయితే.. ఆ తర్వత ఆయన బయటకు వచ్చినప్పటికీ.. బాగా బరువు తగ్గి కనిపించారు. దాదాపు 20 కేజీల బరువు తగ్గడం గమనార్హం. అయితే.. ఇప్పుడు ఆయన తలకు గాయమైనట్లు కనపడటం గమనార్హం.

తాజాగా తన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యేలా తలకు బ్యాండేజీతో కిమ్ దర్శనమిచ్చారు. జులై 24-27 మధ్య నిర్వహించిన కొరియా పీపుల్స్ ఆర్మీ కార్యక్రమంలో పాల్గొన్నప్పటి ఫొటోల్లో.. కిమ్ తల వెనక భాగంలో బ్యాండేజీ కనిపించింది. ఈ ఫొటోలను ఆ దేశ అధికారిక మీడియా విడుదల చేసింది. అయితే జులై చివర్లో జరిగిన మరో కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నప్పటి ఫొటోల్లో.. బ్యాండేజీ స్థానంలో ఆకుపచ్చ రంగులో ఓ మచ్చ కనిపించింది.

దీంతో కిమ్ ఆరోగ్యానికి ఏమైందని మరోసారి చర్చ ఊపందుకుంది. అయితే, కిమ్ ఆరోగ్యం అసాధారణంగా ఏమీ లేదని దక్షిణ కొరియా నిఘా వర్గాలు తెలిపాయి. బ్యాండేజీ తీసేసిన తర్వాత తలపై ఎలాంటి గాయాలు కనిపించలేదని అధికారులు పేర్కొన్నట్లు దక్షిణ కొరియా మీడియా తెలిపింది. జులై 11న జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తలపై ఎలాంటి బ్యాండేజీలు కనిపించలేదని పేర్కొంది. అయితే.. ఉత్తర కొరియా అధికారిక మీడియా విడుదల చేసిన ఫోటోల్లో ముదురు ఆకుపచ్చ రంగులో మరకలు స్పష్టంగా కనిపించాయని తెలిపింది. దీంతో.. ఆయనకు గాయం కానీ.. శస్త్రచికిత్స గానీ జరిగి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.