కరోనా మహమ్మారి మనదేశంలో ఎంతలా విలయతాండవం చేసిందో మనందరికీ తెలిసిందే. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ.. వివిధ రకాల కరోనా వేరియంట్లు అతలాకుతలం చేసేశాయి. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. థర్డ్ వేవ్ కూడా సిద్ధంగా ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు.
ఈ మహమ్మారి నుంచి బయటపడాలంటే.. వ్యాక్సినేషన్ ఒక్కటే దారని ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటి వరకు కేవలం 18ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. దీంతో.. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన చేసింది.
కేవలం 18ఏళ్లు దాటిన వారికి మాత్రమే కాదు.. 18ఏళ్ల లోపు చిన్నారులకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మన దేశంలో 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు వచ్చే నెల అంటే ఆగస్టు మాసం నుంచి కరోనా వ్యాక్సిన్ వేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవియా స్పష్టం చేశారు.
భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ భేటీలో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. ఇక ఇప్పటికే పిల్లల వ్యాక్సిన్ సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ప్రకటించిన సంగతి తెలిసిందే.