సెక్స్ ఎడ్యుకేషన్ ఇది చాలా అవసరం. విద్యార్థి దశలో ఉన్నప్పుడే పిల్లలకు దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఇప్పటి వరకు చాలా మంది నిపుణులు పేర్కొన్నారు. అయితే.. దీనిని ఆచరణలో పెట్టేందుకు అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ తీసుకున్న నిర్ణయం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఐదో తరగతి, ఆ పై తరగతుల విద్యార్థులకు కండోమ్స్ ఉచితంగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్కూల్లోనే కండోమ్స్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతుండటం గమనార్హం.
ఈ నిబంధన ఆ బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు ఈ విద్యా సంవత్సరం నుంచే వర్తించనుంది. ఈ విధానం ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో 250 వరకు, హైస్కూళ్లలో వెయ్యి వరకు కండోమ్స్ ప్యాకెట్లను నిరంతరం అందుబాటులో ఉంచనున్నారు. ఇవి పూర్తిగా ఉచితం. విద్యార్థుల్లో లైంగిక వ్యాధులు, అవాంఛిత గర్భాలను నిరోధించేందుకే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు సీపీఎస్ (చికాగో పబ్లిక్ స్కూల్స్) అధికారులు చెబుతున్నారు.
ఈ సెక్స్ పాలసీపై సీపీఎస్ డాక్టర్ కెన్నెత్ మాట్లాడుతూ, దీనిపై కాస్త వివాదం రేగే అవకాశం ఉన్నప్పటికీ… విద్యార్థుల ఆరోగ్య రీత్యా ఇది అవసరమని తెలిపారు. సమాజం చాలా మార్పులకు గురైందన్నారు. విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచకపోతే… వారికి సరైన జాగ్రత్తలు చెప్పకపోతే… వారికి చెడు జరిగే అవకాశం ఉందన్నారు.
మరోవైపు, సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచాలన్న పాలసీని కొంతమంది తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐదో తరగతి అంటే కేవలం 12 ఏళ్ల వయసు ఉంటుందని… అప్పటికీ వారు ఇంకా చిన్నపిల్లలే అని చెబుతున్నారు. పిల్లలకు కండోమ్స్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది సరైన నిర్ణయం కాదని, దీనిపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates