రూ.కోటి కారు క్షణాల్లో బూడిడైంది.. ఎలన్ మస్క్ కు బ్యాడ్ టైం

ప్రపంచ కుబేరుల జాబితాలో చాలా వేగంగా చోటు సంపాదించుకున్న వారిలో టెస్లా కార్ల అధినేత ఎలాన్ మాస్క్ ఒకరు. తక్కువ వ్యవధిలో సంపన్నుడిగా అవతారమెత్తిన ఆయన టైం ఈ మధ్యన అస్సలేం బాగోలేదన్న మాట వినిపిస్తోంది. మొన్నటికి మొన్న అంతరిక్ష ప్రయాణం గురించి పోస్టు పెడితే.. మళ్లీ రాకు.. అక్కడే ఉండిపో.. ఇంకా పైకిపో అంటూ నెటిజన్లు ఏసుకున్నారు. ఆ మధ్యన అతగాడు పెట్టిన ఒక ట్వీట్ కు ఏకంగా రూ.1.10లక్షల కోట్లు నష్టపోయాడు. అతగాడి కలల పంటగా చెప్పే స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ సీరియల్ నెం.10ను ప్రయోగించిన పది నిమిషాలకే పేలిపోవటం.. మంటలు ఎగజిమ్ముతూ లాంచ్ పాడ్ మీద పడటం లాంటివెన్నో ఉదంతాలు చోటు చేసుకున్నాయి.

ఇలా తరచూ ఏదో ఇష్యూలో దెబ్బ తింటున్న ఆయనకు..తాజాగా చోటు చేసుకున్న పరిణామం భారీ షాక్ ను ఇచ్చిందని చెప్పాలి. ఎలక్ట్రిక్ కార్లలో సంచలనంగా మారిన టెస్లా ఎస్ ప్లెయిడ్ తాజాగా ఆ కంపెనీకి.. ఎలాన్ కు దిమ్మ తిరిగిపోయే షాకిచ్చింది. తాజాగా ఈ కారు అమెరికాలోని పెన్సిల్వేనియాలో మంటలు చెలరేగి.. క్షణాల వ్యవధిలో కాలి బూడిదైంది. ఇది టెస్లాకు భారీ డ్యామేజీగా అభివర్ణిస్తున్నారు.

ఎందుకంటే..ఈ కారు భద్రతపై ఈ మధ్యన ఎలాన్ మాస్క్ మాట్లాడుతూ.. వేగంలో ఫెరారీ.. భద్రతలో వోల్వో కంటే ఎస్ ప్లెయిడ్ ఉత్తమంగా ఉంటుందని చెప్పారు. ఆయన అంత గొప్పగా చెప్పటం.. తీరా చూస్తే.. కారు స్టార్ట్ చేసిన కొద్ది క్షణాలకే మంటలు రేగి కారు క్షణాల్లో బూడిద కావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపు కోటి రూపాయిలు పెట్టి పెన్సిల్వేనియాకు చెందిన ఔత్సాహిక పారిశ్రాకవేత్త మార్క్ గెరాగోస్ ఇటీవల ఎస్ ప్లెయిడ్ ను కొనుగోలు చేశారు.

జులై ఒకటిన ఇంటి నుంచి బయలుదేరి బయటకు వచ్చేందుకు కారు తీయటం.. పది మీటర్లు ప్రయాణించినంతనే కార్లో మంటలు చెలరేగటాన్ని గమనించి.. బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ.. కుదర్లేదు. అతి కష్టమ్మీదా బయటపడ్డారు. ఇది తనకో భయంకర అనుభవంగా ఆయన అభివర్ణించారు. నిజమే కోటి రూపాయిలు పెట్టి కారు కొన్న తర్వాత.. క్షణాల్లో కాలి బూడిద కావటం ఎవరు మాత్రం జీర్ణించుకోగలరు?