కొన్ని నెలలుగా సాగుతున్న సందిగ్ధతకు తెరపడినట్లే. టీ20 ప్రపంచకప్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతందనే విషయంలో స్పష్టత వచ్చేసినట్లే. అనుకున్నట్లే భారత్ నుంచి ఈ టోర్నీ తరలిపోనుంది. యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ జరగబోతోంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబరు-నవంబరు నెలల్లో భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగాల్సింది. కొన్ని నెలల ముందు వరకు ఈ విషయంలో ఎవరికీ సందేహాల్లేవు. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు కథ మారిపోయింది.
ఐపీఎల్ మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తడంతో టీ20 ప్రపంచకప్ మీదా సందేహాలు మొదలయ్యాయి. గత కొన్ని వారాల్లో కరోనా ఉద్ధృతి చాలా వరకు తగ్గినప్పటికీ.. థర్డ్ వేవ్ గురించి హెచ్చరికలు జారీ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా జూన్ నెలాఖరు లోపు కప్పు నిర్వహణపై ఏదో ఒకటి తేల్చి చెప్పాలని బీసీసీఐకి ఐసీసీ ఇప్పటికే అల్టిమేటం విధించింది. గడువు సమీపిస్తున్నా.. బీసీసీఐ ఏమీ తేల్చుకోలేని స్థితిలో ఉంది.
ఇప్పుడు కరోనా ఉద్ధృతి తగ్గినా.. మళ్లీ వైరస్ ప్రభావం పెరగదని గ్యారెంటీ లేదు. ఇంత అనిశ్చితిలో ఇంత పెద్ద టోర్నీ విషయంలో రిస్క్ తీసుకోలేమని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ఐసీసీకి విషయం చెప్పలేదు కానీ.. బీసీసీఐ కార్యదర్శి జై షా మాటల్ని బట్టి చూస్తే టోర్నీని తరలించడం లాంఛనమే అని తేలిపోయింది. టీ20 ప్రపంచకప్ భారత్‌లో జరగదని, యూఏఈలో నిర్వహిస్తామని జై షా మీడియాకు వెల్లడించాడు. త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందని కూడా తేల్చేశాడు.
ఇక బోర్డు వర్గాల సమాచారం ప్రకారం అక్టోబరు 17న ఈ టోర్నీ మొదలవుతుందట. నవంబరు 14న ఫైనల్ జరుగుతుందట. మధ్యలో ఆగిన ఐపీఎల్‌ను కూడా యూఏఈలోనే నిర్వహించనున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ఆరంభానికి కొన్ని రోజుల ముందు ఐపీఎల్ ముగుస్తుంది. ఐపీఎల్ జరిగే వేదికల్లోనే టీ20 ప్రపంచకప్‌నూ నిర్వహించనున్నారు.