శభాష్.. హైదరబాద్ ను బాగా చూసుకుంటున్నారు

హైదరబాద్ మహానగర పురపాలక సంస్థ (GHMC) పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డు వేసిన రెండు రోజులకే వాటర్ బోర్డు వాళ్లు గానీ లేదా కేబుల్ కోసమో లేదా ఇంకేదో విషయం కోసమో వెంటనే తవ్వేస్తుంటారు. జీహెచ్ఎంసీలోని శాఖల మధ్య సమన్వయం ఏ మాత్రం లేదని చాలాసార్లు నిరూపించుకున్నారు. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో మాత్రం జీహెచ్ఎంసీ అధికారులు అద్భుతంగా స్పందిస్తున్నారు.

లాక్ డౌన్ కారణంగా నగరంలో ఉన్న కోటిన్నరకు పైగా వాహనాలు ఇళ్లకే పరిమితం అయిపోయాయి. జనాలు కూడా లేక రోడ్లన్నీ బోసిపోతున్నాయి. ఈ సమయాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్న జీహెచ్ఎంసీ నగరంలోని రోడ్ల మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టింది. భాగ్యనగరంలోని నలుమూలలను 709 కి.మీ.ల రోడ్ల మెయింటనెన్స్‌ను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. అలాగే  వైరస్‌ వ్యాపించకుండా నిరోధించేందుకు అవసరమైన క్రిమిసంహారక మందులను రోడ్లపై పిచికారి చేస్తున్నారు.

విదేశాల నుంచి వచ్చి హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారి ఇళ్లను, కరోనా పాజిటివ్‌గా తేలిన రోగుల ఏరియాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి శుభ్రం చేస్తున్నారు. అలాగే నగరంలోని రోడ్లపై ఉన్న అభాగ్యుల కోసం ఆహారం కూడా సరఫరా చేస్తోంది జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. గుంపులుగా జనం చేరకుండా మనిషికి మనిషికి మధ్య దూరం ఉండేలా చూసుకుంటూ వారి ఆకలి తీరుస్తోంది. అలాగే దాతల నుంచి ఆహారాన్ని, నిత్యావసరాలను సేకరించి అవసరమైనవారికి చేరవేస్తున్నారు. ఆపద సమయంలో అద్భుతంగా పనిచేస్తున్న జీహెచ్ఎంసీకి నగర ప్రజల నుంచి అభినందనలు వస్తున్నాయి.