హైదరాబాద్ లోని నెహ్రూ జంతు ప్రదర్శన శాలలో 83 ఏళ్ల రాణి అనే ఏనుగు మరణించింది. రాణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని.. వృద్ధాప్య కారణాల వల్ల రాణి మరణించినట్లు జూ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఈ జూలో ఉన్న అన్ని జంతువులకంటే రాణి వయసులో పెద్దది. ఇది 1938 అక్టోబర్ 7న పుట్టింది.1963లో ఈ ఏనుగును నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ నుంచి నెహ్రూ జూ కి తీసుకువచ్చారు. హైదరాబాద్ లో జరిగే బోనాల వేడుకలు, మొహర్రం ఊరేగింపుల్లో రాణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేదని అధికారులు తెలిపారు.
ఆసియాలో ఎక్కువ కాలం జీవించి ఉన్న ఏనుగుల్లో ఇది మూడోది కావడం విశేషం. రాణి చనిపోవడంతో హైదరాబాద్ జూలో నాలుగు ఆసియా ఏనుగులే మిగిలాయి.
రాణి జన్మదిన వేడుకలను ప్రతి సంవత్సరం జూ అధికారులు ఘనంగా నిర్వహించేవారు. జూను సందర్శించే పర్యాటకులు ఏనుగుల ఎన్‌క్లోజర్ వద్దకు వచ్చినప్పుడు తన విన్యాసాలతో అలరించేది.
బుధవారం హైదరాబాద్ జూలో 21 ఏళ్ల చిరుతపులి కూడా చనిపోయింది. దీనిని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శన శాల నుంచి 2000 సంవత్సరంలో హైదరాబాద్ జూకు తీసుకువచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates