ఇప్పటివకు విధ్వంసకర బ్యాటింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సెహ్వాగ్.. డివిలియర్స్.. పోలార్డ్ లకు మించి పరుగులు సాధించిన ఒక బ్యాట్స్ మెన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. కేవలం 28 బంతుల్లో 13 సిక్సులు.. 7 ఫోర్లు సాధించి సెంచరీని దాటేసిన వైనం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ అరుదైన ఊచకోతకు వేదికగా నిలిచింది యూరోపియన్ క్రికెట్ సిరీస్ గా చెప్పాలి.
టీ 10 మ్యాచ్ లో సాధించిన పరుగుల వరదతో అంతకు ముందున్న రికార్డుల్ని కొట్టుకుపోయాయి. అంతేకాదు.. పది ఓవర్ల మ్యాచ్ లో భారీ స్కోర్ సాధించటమే కాదు..ప్రత్యర్థి జట్టును దారుణంగా ఓడించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కుమ్మర్ ఫెల్డర్ స్పోర్ట్ వెరిన్ కు టీహెచ్ సిసి హాంబర్గ్ జట్ల మధ్య తాజాగా టీ10 మ్యాచ్ జరిగింది. 32 ఏళ్ల అహ్మద్ ముస్సాదిక్ తన మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లకు హడలెత్తించారు. ఓపెనర్ గా దిగిన ఇతగాడు అయితే సిక్సు కాదంటే ఫోర్ అన్నట్లుగా మ్యాచ్ సాగింది. తాను ఎదుర్కొన్న మొత్తం 28 బంతుల్లో 20 బంతులు సిక్సు లేదంటే ఫోర్ గా నిలవటం గమనార్హం. 28 బంతుల్లో 115 పరుగులు చేసిన అతడు.. 20 బంతులకే 106 పరుగులు చేయటం విశేషం.
28 బంతుల్లో సెంచరీ దాటేసిన అతడు.. కేవలం 13 బంతుల్లో అర్థశతకాన్ని దాటేయటం గమనార్హం. బౌలర్ ఎవరైనా సరే.. బంతిని కఠినంగా శిక్షించటమే పనిగా పెట్టుకున్న అతడి ధాటికి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు కనిపించాయి. పది ఓవర్ల మ్యాచ్ లో భారీ ఇన్సింగ్స్ కు కారణమైన అహ్మద్ చివరి బంతికి అవుట్ అయ్యాడు.
మొదటి బంతిని ఎదుర్కొన్న అతడు చివరి బంతిని కూడా అతడే ఎదుర్కోవటం.. అవుట్ కావటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఇన్నింగ్స్ లోని ఐదో ఓవర్ లో బహ్రోమ్ అలీ బౌలింగ్ లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. మొత్తంగా 10 ఓవర్లకు 198 పరుగుల్ని సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ప్రత్యర్థి జట్టు పది ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 53 పరుగుల్ని మాత్రమే చేయగలిగింది. విధ్వంసక బ్యాటింగ్ తో విరుచుకుపడిన అహ్మద్ చేసిన పరుగుల్లో సగం కూడా చేయకపోవటం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates