నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసుకునే వేళలో రాజుగా వ్యవహరిస్తున్న చివరి నిజాం (మీర్ ఉస్మాన్ అలీఖాన్) ఉన్నారు కదా. ఆయన ముని ముని మనమరాలు. అదెలా అంటారా? మీర్ ఉస్మాన్ అలీఖాన్ కొడుకు మోజం జాహ్. అమీర్ పేట నుంచి దిల్ షుఖ్ నగర్ వెళ్లేటప్పుడు అబిడ్స్ మీదుగా వెళుతున్నప్పు వచ్చే మోజంజాహ్ మార్కెట్ ఉంది కదా? అది ఆయన పేరు మీదనే ఏర్పాటు చేశారు.
ఆయన కుమార్తె ఫాతిమా ఫాజియా. ఆమెకు ఒక కొడుకు పేరు హిమాయత్ మీర్జా. అతడి కుమార్తె జెహ్రా. ఇప్పుడు చెప్పబోతుంది ఆమె గురించే. అంటే చివరి నిజాంకు జెహ్రా ముని ముని మనమరాలు. అమెరికా.. కెనడాలో చదువుకున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటోంది. ఆమెకు చిన్నతనం నుంచే పెయింటింగ్ అంటే మహా ఇష్టం. చాలా పెయింటింగ్స్ వేసి దాచుకున్నది.
కరోనా విలయతాండవంలో ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి చలించింది. తన వరకు తాను ఏమైనా చేయాలన్న సంకల్పంతో చివరకు తాను గీసిన పెయింటింగ్స్ ను వేలానికి పెట్టింది. అలా ఇప్పటివరకు రూ.15 లక్షలు వచ్చాయి. వాటితో ఆమె పలువురికి సాయం అందిస్తున్నారు. పెయింటింగ్స్ వేలం వేస్తే వచ్చే డబ్బుల్ని పలు ఆసుపత్రులకు.. చారిటబుల్ ట్రస్టుకు అందజేస్తున్నారు. వయసు చిన్నదే అయినా.. కష్టంలో ఉన్న వారికి సాయం చేయాలన్న మనసు పెద్దది.
Gulte Telugu Telugu Political and Movie News Updates