కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎంతలా విజృంభిస్తుందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మనదేశంలో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని రాష్ట్రాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం గ్రామాలపై ఫోకస్ పెట్టింది.
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు, రాష్ట్రంలో కోవిడ్19 కేసులు, మరణాలు అరికట్టడంలో భాగంగా మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ వినూత్నంగా ఆలోచించింది. ఎన్ని జాగ్రత్తలు చెప్పినా, జరిమానాలు వేసిన అంతగా ప్రయోజనం ఉండదని, ఏకంగా నగదు బహుమతి ప్రకటించి పోటీలను ప్రారంభించింది. కరోనాను నిర్మూలించిన గ్రామాలకు రూ.50 లక్షలు, రూ.25 లక్షలు, రూ.15 లక్షల మేర నగదు బహుమతి అందించనున్నారు.
కరోనా నిర్మూలనపై పోటీల వివరాలను మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ హసన్ ముష్రిఫ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ వివరించారు. కరోనా కట్టడి చర్యలలో భాగంగా గ్రామీణ ప్రాంతాల వారికి నగదు బహుమతి ప్రకటించినట్లు తెలిపారు. కోవిడ్19 నిబంధనలు పాటించి, కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రతి రెవెన్యూ డివిజన్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన గ్రామ పంచాయతీలకు నగదు అందజేయనున్నట్లు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates