ఆ రిపోర్టు చూపిస్తేనే ఆనందయ్య మందు..!

ఆనందయ్య కరోనా మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ఎప్పుడు దానిని పంచిపెడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆనందయ్య మందు తెచ్చుకోవాలని తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునే వున్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు సిద్ధంగా వున్నారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య బుధవారం మీడియాతో మాట్లాడారు. కరోనా పాజిటివ్ రిపోర్టు చూపించి మందు తీసుకోవచ్చునని ఆయన స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాలవాళ్లు కృష్ణపట్నం రావద్దని, తామే మందు పంపిస్తామని ఆనందయ్య సూచించారు. ఆదివారం నుంచి లేదా సోమవారం నుంచి మందు పంపిణీ చేసేందుకు సన్నాహలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. క్లిష్ట పరిస్ధితుల్లో తనకు సహకరించిన వారందరికీ ఆనందయ్య ధన్యావాదాలు తెలిపారు.

మరోవైపు కృష్ణపట్నంలోకి బయటి వ్యక్తులను పోలీసులు అనుమతించడం లేదు. గ్రామంలో 144వ సెక్షన్ ను అమలు చేస్తున్నారు. ఆనందయ్య మందు కోసం ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశాలు ఉండడంతో వారిని అడ్డుకోవడానికి ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తులను మాత్రమే కృష్ణపట్నంలోకి అనుమతిస్తున్నారు. అది కూడా ఆధార్ కార్డు చూపించిన తర్వాత వారు కృష్ణపట్నానికి చెందినవారేనని ధ్రువీకరించుకున్న తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు.

ఆనందయ్య మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని అధికారులు సూచించారు. ఆనందయ్య మందు పంపిణీకి మరో నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని కృష్ణపట్నం పోర్టుకు తరలించారు. హైదరాబాదులో బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప మందు లాగానే ఆనందయ్య తన మందును పంపిణీ చేసుకోవచ్చునని ప్రభుత్వం చెప్పింది. మరోవైపు ఆనందయ్య కంట్లో వేసే చుక్కల మందుపై హైకోర్టు గురువారం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.