కరోనా లోకంలో ఎన్నో లోపాలను బయటపెట్టింది. వైద్యం ఇంకా సామాన్యుడికి లగ్జరీ అనే విషయాన్ని తేల్చింది. పేదరికం మన దేశాన్ని వదిలేయడం అంత సులువు కాదని చెప్పింది. ఈ కరోనాలో తల్లిదండ్రులను వదిలేసిన పిల్లలను చూశాం గాని పిల్లలను వదిలేసిన తల్లిదండ్రులను మాత్రం మనం చూడలేదు. కన్న ప్రేమ ఎన్నటికీ కరగనది. దానికి తాజా ఉదాహరణ మన పక్కనే ఉన్న కర్ణాటకలో జరిగింది.
కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. అందుకే లాక్ డౌన్ కూడా కఠినంగా ఉంది. ఏ సోషల్ మీడియాలు తెలీని ఓ తండ్రి తన కొడుకును బతికించుకునేందుకు మందుల కోసం ఏకంగా 3 రోజుల పాటు సైకిల్ తొక్కి బతికించుకున్నాడు. కొడుక్కి వాడాల్సిన మందులు దగ్గర్లో ఎక్కడా దొరకడం లేదు. పెద్ద టౌన్లకు వెళ్లడానికి బస్సుల్లేవు, ఏం చేయాలో తెలియని ఆ తండ్రి రానుపోను 300 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి మందులను తెచ్చాడు. కర్ణాటకలోని మైసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గనిగనకొప్పాలు అనే గ్రామానికి చెందిన ఆనంద్ ఈ సాహసానికి ఒడిగట్టాడు.
ఆనంద్ కొడుక్కి పదేళ్లు. అతనికి 6 నెలల పసికందుగా ఉన్నపుడే అరుదైన వ్యాధి వచ్చింది. 18 సంవత్సరాల వరకు ప్రతిరోజూ ఒక మెడిసిన్ వాడితేనే అతను బతుకుతాడు. ఒక్క రోజు కూడా మిస్ కాకూడదు. దీంతో ఆనంద్ గత పదేళ్లుగా కొడుకును శ్రద్ధగా చూసుకుంటున్నాడు. కుమారుడికి క్రమం తప్పకుండా మందులను వాడుతు వస్తున్నాడు. ఆ మందులు బెంగళూరులోని ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్ అందిస్తుంది. కర్ణాటకలో చాలా రోజుల నుంచి లాక్ డౌన్ నడుస్తోంది. మరో 3 రోజుల్లో తన కుమారుడికి ఇవ్వాల్సిన మెడిసిన్లు అయిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లోను బెంగుళూరు వెళ్లి తెచ్చుకోవాలి. కానీ లాక్‌డౌన్ వల్ల రవాణా సదుపాయం లేదు.
అతను బంధువులు, స్నేహితులను టూవీలర్ ఇవ్వమని కోరాడు. లాక్‌డౌన్ వల్ల వాహనం సీజ్ చేస్తారన్న భయంతో ఎవరూ ఆనంద్‌కు బైకు ఇవ్వలేదు. దీంతో ఏం చేయాలో తెలియని ఆనంద్ తన సైకిల్ నే నమ్ముకున్నాడు. 150 కిలోమీటర్ల దూరం ఉన్న బెంగుళూరుకు సైకిల్ వెళ్లి మందులను తీసుకుని మళ్లీ అంతే దూరం సైకిల్ తొక్కి ఇంటికి వచ్చాడు. దీనికి అతనికి 3 రోజులు పట్టింది. ఏదైతేనేం ఎవరూ సహకరించకపోయినా తన కొడుక్కి ఇవ్వాల్సిన మెడిసిన్ డోసు మిస్ కాలేదు.
కానీ ఇంత విశాలమైన సమాజంలో అంత అత్యవసరంలోను ఎవరూ సహాయపడకపోవడం ఒక విచారం అయితే, కొడుకును బతికించుకోవాలన్న అతని తపన మాత్రం ముచ్చట కలిగిస్తోంది.