‘సైకిల్ జ్యోతి’ తండ్రి మృతి

సైకిల్ జ్యోతి.. గతేడాది ఈ పేరు దేశమంతటా మారుమోగింది. ఈ పేరు వినగానే ఆమె కథ అందతా మీకు గుర్తుకువచ్చే ఉంటుంది. గతేడాది కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న క్రమంలో లాక్ డౌన్ విధించారు. ఆ లాక్ డౌన్ సమయంలో అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్ర‌యాణించి త‌మ ఇంటికి తీసుకువ‌చ్చింది. తండ్రి ప్రాణాలు కాపాడటానికి ఆమె చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంది. కేవలం ఏడు రోజుల్లో ఆమె తన లక్ష్యాన్ని చేరుకోవడ విశేషం. దీనిని కొందరు వీడియో, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారాయి.

ఆమె తండ్రి కోసం పడిన తపన.. అమెరికా మాజీ దేశాధ్యక్షుని కూతురు ఇవాంక ట్రంప్ ని కూడా ఆకట్టుకుంది. ఆమె ట్వీట్ తో ఈ సైకిల్ జ్యోతి ప్రపంచానికి కూడా చేరువైంది. కాగా.. ఇప్పుడు ఆ జ్యోతి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఏ తండ్రి కోసమైతే.. ఆమె గతేడాది అంత సాహసం చేసిందో.. సరిగ్గా ఏడాది తిరిగిలోపు ఆమె ఆ తండ్రి దూరమయ్యాడు. జ్యోతి తండ్రి మోహన్ పాశ్వాన్ గుండెపోటుతో మరణించారు. ఈ వార్త అందరినీ కలచివేస్తోంది.

మోహ‌న్ పాశ్వాన్ గురుగ్రామ్‌లో ఈ-రిక్షా న‌డిపేవారు. దేశ‌వ్యాప్త‌ క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల రిక్షా య‌జ‌మాని దానిని తీసుకున్నాడు. దీంతో ఆయ‌నకు ఉపాధిలేకుండా పోయింది. పాశ్వాన్‌ కాలికి గాయం కావ‌డంతో ఆయ‌న బాగోగులు చూడ‌టానికి 16 ఏండ్ల జోత్యి గురుగ్రామ్‌కు వెళ్లింది. అదే స‌మ‌యంలో లాక్‌డౌన్ రావ‌డం.. చేసేందుకు ప‌నుల్లేక‌ జీవ‌నం క‌ష్టంగా మారింది. దీనికితోడు ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డ నిలిచిపోవ‌డం, తండ్రికి అనారోగ్యంగా ఉండటంతో.. జ్యోతి ధైర్యం చేసి తండ్రిని సైకిల్ పై స్వగ్రామానికి తీసుకువచ్చింది.