వ్యాక్సిన్ వేసుకుని 7 కోట్లు పట్టేసింది

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. కాస్త ఎక్కువ ఖర్చయినా పర్వాలేదని వ్యాక్సిన్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు జనాలు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలు పెట్టి వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. అలాంటిది వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా ఓ అమ్మాయి రూ.7 కోట్ల నజరానా అందుకుందంటే నమ్మగలరా? అగ్రరాజ్యం అమెరికాలో ఇది జరిగింది.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ఉద్ధృతంగా సాగుతున్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని నెలల ముందు ఈ పరిస్థితి లేదు. వ్యాక్సిన్ వేసుకోమని ప్రభుత్వాలు జనాలను మోటివేట్ చేయాల్సిన పరిస్థితి. ఇండియాలో మాత్రమే కాదు.. చాలా దేశాల్లో ఇదే పరిస్థితి. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన అమెరికా కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇప్పటికీ వ్యాక్సినేషన్ పట్ల ఆసక్తి చూపని వాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారక్కడ.

ఐతే ప్రపంచంలో అందరికొటే ముందు కొవిడ్ టీకాలు వేయడం మొదలుపెట్టి.. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ చేయిస్తున్న ఆ దేశంలో జులై 4 నాటికి 70 శాతం మంది యువతను ఇందులో భాగస్వాముల్ని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది బైడెన్ సర్కారు. ఐతే వ్యాక్సిన్ తీసుకునేందుకు యువత అంతగా ఆసక్తి చూపడం లేదన్న విషయాన్ని గుర్తించిన యుఎస్‌లోని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు.. వారిని ఆకర్షించేందుకు ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓహియో రాష్ట్రం ఒక లాటరీని ప్రకటించింది.

‘వ్యాక్స్ ఏ మిలియన్’ పేరుతో పది లక్షల మంది యువతకు వ్యాక్సిన్లు వేయించాలన్న లక్ష్యం పెట్టుకుని.. టీకా తీసుకున్న వారిలో ఒకరిని లాటరీ విధానంలో ఎంపిక చేసి 10 లక్షల డాలర్లు (రూ.7 కోట్ల పైమాటే) బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. కాగా గత ఏడాదే ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అబిగైల్ బుగెన్‌స్కీ అనే అమ్మాయి ఈ లాటరీలో విజేతగా నిలిచింది. ఓహియో రాష్ట్ర గవర్నర్.. అబిగైల్ మిలియన్ డాలర్లు గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయం ఫోన్ చేసి ఆ అమ్మాయికి చెబితే ఇదేదో ప్రాంక్ కాల్ అనుకుందట. తర్వాత నిజంగానే తనకు మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ దక్కిందని తెలిసి ఆమె ఆనందానికి అవధుల్లేకపోయాయి.