కరోనా విషయంలో ముందుగా హెచ్చరించలేదని బాధపడుతుంటాం. కానీ, కొన్ని కొన్ని హెచ్చరికలు మన దాకా వస్తే.. మాత్రం ఒళ్లు గగుర్పొడుస్తుంది! అంత భీతా వహ పరిస్థితి ఎదురవుతుందా? అని చెమటలు కూడా పడతాయి. ఇప్పుడు ఇలాంటి అంచనానే ఒకటి దేశాన్ని సైతం కలవరపరుస్తోంది. దేశంలోనే ప్రఖ్యాతి గడించిన సంస్థ.. ఐఐఎస్(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్) తాజాగా కర్ణాటక రాజధాని, దేశానికే ఐటీ కేపిటల్‌గా ఉన్న బెంగళూరులో కరోనా పరిస్థితిపై అధ్యయనం చేసింది. ఇక్కడి పరిస్థితులను తాజాగా ఒక నివేదిక రూపంలో కేంద్రానికి అందజేసింది.
ఇప్పుడు ఐఐఎస్ ఇచ్చిన నివేదికలోని అంశాలు బయటకు పొక్కాయి. ఈ విషయాలు తెలిసి.. ప్రతి ఒక్కరూ నివ్వెర పోతున్నారు. ఐఐఎస్ నివేదిక ప్రకారం.. ఈ నెల 17 నాటికి బెంగళూరులో కేసులు పతాకస్థాయికి చేరుకుంటాయని నివేదిక పేర్కొంది. వచ్చే నెల(జూన్) 11 నాటికి బెంగళూరులో మరో 14 వేల మంది కరోనా తో మరణిస్తారని ఇనిస్టిట్యూట్ నిపుణులు అంచనా వేశారు. అంటే.. రోజుకు కనీసంలో కనీసంగా 466 మంది చనిపోవడం ఖాయమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం, అమల్లో ఉన్న లాక్‌డౌన్ తరహా ఆంక్షలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు.
నమోదవుతున్న ఒక్కో కేసు వెనక, వెలుగులోకి రాని రెండు కేసులు ఉన్నాయని ఐఐఎస్ నిపుణులు పేర్కొన్నారు. నిజానికి మరణాల సంఖ్య 26 వేల వరకు ఉంటుందని ఐఐఎస్ నిపుణులు తొలుత అంచనా వేశారు. అయితే, రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఆంక్షల కారణంగా ఈ సంఖ్య 14 వేలకు తగ్గే అవకాశం ఉందని వివరించారు. కనీసం రెండు వారాలపాటు కర్ణాటకలో కరోనా ప్రమాదకరస్థాయిలో ఉంటుందని తెలిపారు. అలాగే, 10 నుంచి 14 రోజులపాటు కరోన మరణాలు తీవ్రస్థాయిలో ఉంటాయని వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates